సచిన్​.. నీకెందుకయ్యా రాజకీయాలు..! శరద్​ పవార్​ వ్యాఖ్యలు..!

Update: 2021-02-07 09:30 GMT
క్రికెట్​ లెజెండ్​ సచిన్​ టెండుల్కర్​పై ... ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. సచిన్​ టెండుల్కర్​ క్రికెట్​ విషయాలు మాత్రం మాట్లాడితే బాగుంటుందని అన్నారు. ఇతర విషయాలు మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇటీవల పాపులర్​ సింగర్​ అమెరికాకు చెందిన రిహాన్నా.. రైతు సమస్యలపై మాట్లాడిన విషయం తెలిసిందే. రైతు సంఘాలకు మద్దతుగా ఆమె ట్వీట్​ చేశారు. ఈ ట్వీట్ సోషల్​మీడియాలో వైరల్​గా మారింది.

 అయితే ఈ ట్వీట్​పై సచిన్​ టెండుల్కర్​ స్పందించారు. ‘మా దేశ సమస్యలు మేము పరిష్కరించుకోగలం.  వీదేశీ వ్యక్తుల మద్దతు, జోక్యం అవసరం లేదు’ అని అర్థం వచ్చేలా సచిన్​ టెండుల్కర్​ ట్వీట్​ చేశారు. అయితే సచిన్​పై దేశవ్యాప్తంగా ఓ వర్గం విమర్శలు చేసింది. ఢిల్లీలో రైతులపై పోలీసులు లాఠీ చార్జ్​ చేసినప్పుడు.. ఇంతకాలంగా రైతులు పోరాటం చేస్తుంటే స్పందించని సచిన్​ ఇప్పుడెందుకు స్పందిస్తున్నారంటూ కొందరు సోషల్​మీడియాలో విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ విషయంపై శరద్​పవార్​ స్పందించారు.

ఇటీవల ఆయన మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘సచిన్​ టెండుల్కర్​ క్రికెట్​ గురించి ఎంతైనా మాట్లాడొచ్చు. కానీ ఇతర విషయాలపై స్పందించేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి’ అని ఆయన పేర్కొన్నారు. అంతేకాక ఆందోళనలు చేస్తున్న అన్నదాతలను కొందరు బీజేపీ నేతలు ఖలిస్థాన్​ ఉగ్రవాదులుగా చిత్రీకరించడాన్ని కూడా శరద్​ పవార్​ తప్పుపట్టారు. కేంద్రం రైతు సమస్యలను దారి మళ్లిస్తున్నదని ఆరోపించారు.


పవార్​ వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. ఈ మేరకు బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖీ ఓ ట్వీట్​ చేశారు. ‘శరద్​ పవార్​ తన సలహాలు సూచనలు విదేశీ సెలబ్రిటీలు మియా ఖలీఫా, రిహాన్న, గ్రేటా థన్​బెర్గ్​లకు ఇస్తే బాగుంటుంది. శరద్​ పవార్​ గతంలో వ్యవసాయ మంత్రిగా ఉన్నాడు. అప్పుడు ఏపీఎంసీతో కలిసి అతడు పనిచేశాడు. సంస్కరణలకు అనుకూలంగా లేఖలు రాశాడు’ అంటూ ఆమె ట్వీట్​ చేశారు.

శరద్​పవార్​పై నెటిజన్లు కూడా మండిపడ్డారు. విదేశీ మహిళ మరో దేశ సమస్య గురించి మాట్లాడితే తప్పు లేదుకానీ.. మన దేశ క్రికెటర్​ మాట్లాడితే తప్పు అయ్యిందా? అంటూ ఓ నెటిజన్​ స్పందించారు.
Tags:    

Similar News