గాడ్సేని బంధించినోడి ఫ్యామిలీని మర్చిపోయారు

Update: 2016-05-12 09:47 GMT
చేసిన త్యాగాన్ని గుర్తుంచుకునే తత్వం మన నేతల్లో చాలా తక్కువ. అయితే.. ఎక్కడో ఒకరిద్దరు మినహాయిస్తే.. మిగిలిన వారెవరికి ప్రాణాలు పణంగా పెట్టి త్యాగం చేసిన వారు ఎవరూ పట్టించుకోరు. జాతిపిత మహాత్మగాంధీని కాల్చి చంపిన గాడ్సేను చూసిన వాళ్లు.. అప్పట్లో బెదిరిపోతే.. ఒకరు మాత్రం ప్రాణానికి తెగించి మరీ అతడ్ని బంధించి పోలీసులకు అప్పగించారు. అలా బంధించిన వ్యక్తి ఒడిశాకు చెందిన రఘునాయక్. అప్పట్లో అతడి ధైర్య సాహసాల్ని మెచ్చి నాటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ రూ.500 బహుమానం అందించారు.

అక్కడితో రఘునాయక్ ను.. అతడి కుటుంబాన్ని ఎవరూ పట్టించుకున్నది లేదు. తర్వాతి కాలంలో ఆయన మరణించారు. ఆయన మరణించిన 33 ఏళ్ల తర్వాత ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పుణ్యమా అని.. గాడ్సేను బంధించిన రుఘునాయక్ కుటుంబానికి మరికాస్త న్యాయం జరిగింది. రఘునాయక్ సతీమణి మండోదరకు ఒడిశా సీఎం రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. పుట్టెడు పేదరికంలో ఉన్న ఆమెను గుర్తించిన ఒడిశా సీఎం.. ఆమెకు ఆర్థిక సాయాన్ని అందించాలన్న నిర్ణయం తీసుకోవటం హర్షనీయం.

 జాతిపితను చంపిన నేరస్తుడ్ని పట్టుకునేందుకు ఒక సామాన్యుడు అసమాన్యంగా వ్యవహరిస్తే.. అతడి కుటుంబాన్ని పట్టించుకోకపోవటానికి మించి దౌర్భాగ్యం ఇంకేం ఉంటుంది. మొత్తానికి ఇప్పటివరకూ జరిగిన తప్పును నవీన్ పట్నాయక్ అయినా సరిదిద్దారని చెప్పాలి.
Tags:    

Similar News