కేసీఆర్ పై నేషనల్ మీడియా ఫైర్

Update: 2017-02-21 09:37 GMT
తిరుమల వెంకన్నకు నగలు సమర్పించి మొక్కు తీర్చుకునేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ వెళ్తున్న వేళ అటు తెలంగాణ, ఇటు ఏపీలో మీడియా అంతా గొప్పగా కథనాలు రాస్తున్న వేళ నేషనల్ మీడియా కేసీఆర్ కు షాకిచ్చింది. కేసీఆర్ మొక్కు ఏంటి.. ఆ నగలు విలువెంత.. ఎలా ఉన్నాయి.. ఎక్కడ చేయించారు.. ఎప్పుడు చేయించారు.. కేసీఆర్ ఎలా వెళ్తున్నారు.. ఎన్ని రోజులుంటారు.. ఏమేం చేస్తారు వంటి విశేషాలతో తెలుగు మీడియా భజన మేళం ఎత్తుకుంటే నేషనల్ మీడియా మాత్రం ఇందులో ప్రజాకోణం పట్టుకుంది. తిరుమల వెంకన్నకు ఆయన చెల్లించుకోనున్న మొక్కుల వల్ల సామాన్యులపై రూ. 5.6 కోట్ల భారం పడుతుందని ఏకి పడేసింది.
    
వెంకన్నకు స్వర్ణాభరణాలను, పద్మావతి అమ్మవారికి ముక్కుపుడకకు ఎంత ఖర్చయింది.. తమ తిరుమల ప్రయాణం కోసం కుటుంబ సభ్యులు, మంత్రులతో కలసి వెళ్తున్న ప్రత్యేక విమానం ఖర్చెంతవంటివన్నీ ప్రస్తావించింది. కేసీఆర్ మత సంబంధమైన నమ్మకాలతో కేసీఆర్ ప్రజా ధనాన్ని ఉపయోగించడం ఇదే ప్రథమం కాదని సదరు జాతీయ మీడియా సంస్థ తెలిపింది. వరంగల్ వద్ద ఉన్న భద్రకాళి అమ్మవారికి రూ. 3 కోట్లతో 11 కేజీల బంగారు కిరీటాన్ని సమర్పించారని వెల్లడించింది.  
    
ఇటీవలే కేసీఆర్ అత్యంత విలాసవంతమైన కొత్త భవంతిలోకి తన నివాసాన్ని మార్చారని..  హైదరాబాద్ నడిబొడ్డున 9 ఎకరాల స్థలంలో ఈ భవంతిని నిర్మించారని... దీని నిర్మాణానికి రూ. 35 కోట్లు ఖర్చు అవుతుందని తొలుత చెప్పినప్పటికీ... ఫైనల్ బిల్ మాత్రం రూ. 50 కోట్లు వచ్చిందని విమర్శించింది. కేసీఆర్ తన వ్యక్తిగత విలాసాలు, మతపరమైన కార్యక్రమాలకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న తీరును ప్రతిపక్షాలు తప్పుబడుతున్నప్పటికీ... ఆయన ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆ కథనంలో ప్రస్తావించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News