ఎర్రకోట నుంచి మోడీ ఏం చెప్పారు?

Update: 2016-08-15 05:56 GMT
మంచి వక్త అయిన ఒక నేత దేశ ప్రధానిగా ఉంటే.. చప్పగా సాగే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేసే ప్రసంగం ఎంత ఉత్తేజపూరితంగా ఉంటుందన్న విషయాన్ని ప్రధాని మోడీ తన తాజా ప్రసంగంతో చెప్పకనే చెప్పేశారు. మిగిలిన వేదికల సంగతి ఎలా ఉన్నా.. ఆగస్టు15.. జనవరి 26 సందర్భంగా చారిత్రక ఎర్రకోట నుంచి చేసే ప్రసంగ పాఠాన్ని ముందస్తుగా సిద్ధంగా చేయటం.. వాటిని చదువుకుంటూ ఉండటం.. మీడియాకు.. కొంతమంది ఆహుతులకు ముందే ప్రసంగ పాఠం ఇచ్చేయటంతో.. ఆయన చెప్పింది ఎంత? చెప్పాల్సింది ఎంత? అన్నది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవటానికి ఉంటుంది.

కానీ.. ప్రధాని మోడీ విషయంలో అలాంటి ఇబ్బంది ఉండదు. పరవళ్లు తొక్కే నదీమ తల్లిలా ఆయన ప్రసంగం సాగుతుంది. దాదాపు గంట పదిహేను నిమిషాల కంటే ఎక్కువగానే ప్రసంగించిన మోడీ.. తన ప్రసంగంలో ఎక్కడా తడబడింది లేదు. మాటల కోసం వెతుక్కున్నది లేదు. మొదటి నుంచి చివరి వరకూ.. ఒకే ఫ్లోలో కొనసాగించిన ఆయన ప్రసంగంలో విశేషాలకు కొదవ లేదు.

ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన సమయంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ లాంటి అంశాల్ని ఇప్పటివరకూ ఏ ప్రధాని నేరుగా ప్రస్తావించి ఉండరు.కానీ.. మోడీ తాజాగా ఆ పని కూడా చేసేశారు. పాక్ వ్యవహారశైలి మీద తన ఆగ్రహాన్ని వెళ్లగక్కేందుకు ఏ మాత్రం మొహమాటం పడని ఆయన.. ఈ సందర్భంగా పాకిస్థాన్ కు.. భారతదేశానికి మధ్యనునన వ్యత్యాసాన్ని ఒక ఉదాహరణతో చెప్పేశారు.

పెషావర్ లోని ఒక స్కూల్లో ఉగ్రదాడి జరిగినప్పుడు భారతదేశంలోని ప్రతి స్కూల్ రోదించిందని.. ప్రతి పిల్లాడు బాధ పడ్డాడని.. అలాంటి వ్యక్తిత్వం భారత్ సొంతం అంటూనే.. ఉగ్రవాదుల్ని కీర్తించే దుర్మార్గమైన బుద్ది పాకిస్థాన్ సర్కారుదన్న విషయాన్ని తన మాటలతో చెప్పకనే చెప్పేశారు.

ఇవే కాదు.. తమ సర్కారు గడిచిన రెండేళ్లలో చేసిన పనులు.. చేయాల్సిన పనుల గురించి ఘంటాపథంగా చెప్పిన ఆయన.. భూత.. వర్తమాన.. భవిష్యత్ కాలాల గురించి.. ఆ సందర్భంగా ఏమేం చేశాం.. ఏమేం చేయాలనుకుంటున్న విషయాన్ని చెప్పుకొచ్చారు.

ముఖ్యంగా అభివృద్ధి మీద దృష్టి పెట్టిన ఆయన.. దేశ ప్రగతికి ఆటంకంగా ఉన్న అంశాలు.. అవకాశాల్ని ప్రస్తావించారు. సురాజ్యంగా ఏర్పడాలంటే త్యాగాలు తప్పనిసరి అని..నిరంతర సంకల్పంతోనే అలాంటివి సాధించగలమన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో తీసుకొచ్చిన డిజిటలైజేషన్ తో ఎలాంటి మార్పు వచ్చిందన్న విషయాన్ని ఉదాహరణతో సహా చెప్పిన మోడీ.. గతంలో పాస్ పోర్ట్ తీసుకోవాలంటే నాలుగైదు నెలలు పట్టేదని.. ఇప్పుడు నాలుగు రోజుల్లో ఇంటికే వస్తుందని చెప్పుకొచ్చారు.

గతంలో ఒక కంపెనీ నమోదు కోసం నెల రోజులు పడితే.. ఇప్పుడు 24 గంటల్లోనే కంపెనీ నమోదుఅవుతుందని చెప్పిన మోడీ.. ప్రస్తుతం కాలం మారిందని.. కళ్లెదుట జరిగిన పని కనబడినప్పుడే ప్రజలు విశ్వసిస్తారన్నారు. గడిచిన రెండేళ్లలో తమ సర్కారు చేపట్టిన కార్యక్రమాల గురించి వివరంగా వివరించిన ఆయన..  వేలాది కోట్ల రూపాయిలు వృధా చేశారని.. ప్రతి రూపాయి సద్వినియోగం చేసేందుకే ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తున్నట్లుగా పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవంసందర్భంగా రోటీన్ రొడ్డుకొట్టుడు ప్రసంగ పాఠాన్ని చదివే వైనాన్ని పక్కన పెట్టి.. ప్రతిపక్షాల్ని.. వైరి దేశాలపై కౌంటర్లు వేస్తూ.. సుదీర్ఘ ప్రసంగం చేయటం మోడీ లాంటి నేతకే చెల్లుతుందేమో.
Tags:    

Similar News