వైసీపీ బ్లాక్ అవుట్- బాబు తీవ్ర స్వరం
ఏపీలో టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్లుగా రాజకీయాలు భీకర స్థాయిలో జరుగుతున్నాయి.;
ఏపీలో టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్లుగా రాజకీయాలు భీకర స్థాయిలో జరుగుతున్నాయి. అదే సమయంలో రాజధాని వంటి కీలకమైన అంశం, ప్రజలకు సంబంధించిన విషయం ఇపుడున్న అయిదు కోట్ల మంది మాత్రమే కాదు రాబోయే తరాలకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంశంలో ఏకాభిప్రాయానికి రాలేకపోవడం అత్యంత దురదృష్టకరమైన పరిణామంగానే అంతా చూస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ అయితే అమరావతి విషయంలో వ్యతిరేకత లేదంటూనే ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు గైర్ హాజరు అయింది. పార్లమెంట్ ఉభయ సభలలోనూ తన వాయిస్ వినిపించి వాకౌట్ చేసింది. దాంతో వైసీపీ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.
వాకౌట్ చేస్తారా :
ఎంతో ముఖ్యమైనది అమరావతి రాజధాని అంశం. దేశంలోని అన్ని పార్టీలూ మద్దతు ఇస్తే ఏపీకే చెందిన వైసీపీ సభలో వాకౌట్ చేయడమేంటి అని బాబు ప్రశ్నించారు. ఈ విధంగా అమరావతి రాజధానికి వ్యతిరేకంగా వాకౌట్ చేసిన వారిని బ్లాక్ ఔట్ చేయాలని ఆయన ప్రజలకు పిలుపు ఇచ్చారు. రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెం వద్ద రైతులతో కలిసి సతీ సమేతంగా అమరావతికి దీప హారతి కార్యక్రమంలో బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ తీరు మీద మండిపడ్డారు. తన మొత్తం రాజకీయ జీవితంలో వైసీపీ లాంటి పార్టీని ఎక్కడా చూడలేదని అన్నారు. ఇది దారుణమైన తీరు అని కూడా అన్నారు.
అపహాస్యం చేస్తారా :
రాజధాని అంటే అంత చులకనా అని ద్వజమెత్తారు. మావిగన్ అంటూ రాజధానిపై అపహాస్యమా అని ప్రశ్నించారు. దేశ చరిత్రలో అమరావతి విజయం సువర్ణ అక్షరాలతో లిఖించదగిందని బాబు అన్నారు. అమరావతి చరిత్ర శాశ్వతం అని ఆయన అంటూ అందులో రైతులు చేసిన త్యాగం మరింత శాశ్వతం అన్నారు. అనేక కుట్రలను ఎదుర్కొని రాజధానిని దక్కించుకున్నామని, రాజధానిని స్మశానం అన్న వారు నేడు అడ్రస్ లేకుండా పోయారని బాబు వైసీపీ మీద నిప్పులు చెరిగారు. అదే సమయంలో ఇప్పటి వరకు రాష్ట్రానికి అడ్రస్ లేదని, కానీ నేడు ఒక శాశ్వత అడ్రస్ వచ్చిందని అన్నారు.
తిరుగులేని శాసనం :
ఇక అమరావతికి పార్లమెంట్ చట్టం చేయడం ద్వారా తిరుగులేని శాసనం అయిందని అన్నారు. ఆనాడు 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చి చేసిన త్యాగం వల్లే ఈ విజయం సాధ్యమైందని బాబు గుర్తు చేసుకున్నారు. ఏకంగా ఒక వేయి 631 రోజుల ఉద్యమం అమరావతి రైతులు చేయడం కూడా ఒక చరిత్ర అని బాబు అన్నారు. ఈ ఉద్యమాన్ని అడ్డుకున్న ఆనాటి ప్రభుత్వంపై రాజధాని రైతులు, మహిళలు వీరత్వం, ప్రతాపం చూపారని బాబు ఫ్లాష్ బ్యాక్ ని మరోసారి వివరించారు. ఇక ఈ బిల్లు ఆమోదంతో ప్రజా సంకల్పానికి గౌరవం దక్కింది అన్నారు.
జోలె పట్టాను అంటూ :
అనాడు తాను అమరావతి ఉద్యమం కోసం నేను స్వయంగా జోలె పట్టానని బాబు అన్నారు. అప్పట్లో న్యాయస్థానం టు దేవస్థానం కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం అడ్డుకుందని బాబు అన్నారు. ఆ సమయంలో ఒక్క అడుగూ వెనక్కుక తగ్గినా ఆ తర్వాత పది అడుగులు వేసి సింహాల్లా రైతులు జనాలు అంతా దూకారని బాబు కితాబు ఇచ్చారు. ఇక 2024లో కూటమి పార్టీకి అద్భుత విజయం అందించారని అన్నారు. దాంతోనే ఇప్పుడు రాజధానికి చట్టబద్ధత కలిగిందని చెప్పరు. అమరావతిలోని రైతులు, రైతు కూలీలు, ప్రజల ఐకమత్యం వల్లే ఈ విజయం సాధించుకున్నామని అన్నారు.
చీకటి పాలన :
వైసీపీది చీకటి పాలన అని బాబు నిందించారు. 2019లో ప్రజలను ఏమార్చారని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ . ఐదేళ్ల పాటు చీకటి రోజులుగా రాష్ట్రానికి దాపురించాయని అన్నరు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభమైన చీకటి రోజులు 2024 ప్రజా తీర్పుతో ముగిశాయని బాబు అన్నారు. ఇక అమరావతికి అపజయం లేదని అన్ స్టాపబుల్ అంటూ ప్రజా రాజధానిని సాధించుకున్నామని బాబు ఆనందం వ్యక్తం చేశారు.
పార్టీ పీడ విరగడవ్వాలి :
ప్రజల ఆకాంక్ష అయిన అమరావతిని చంపాలనుకున్న పార్టీ పీడ విరగడ అవ్వాలని వైసీపీ మీద ఆయన ఫైర్ అయ్యారు. రాజధానితో మూడు ముక్కలాట ఆడారని చివరికి అడ్రస్ లేకుండా పోయారని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి విషయంలో ఇంత జరిగినా వైసీపీకి మాత్రం బుద్ది రాలేదని పైగా వారి పిచ్చి ఇంకా ముదిరిందని బాబు అన్నారు. అమరావతిని చంపాలనుకున్న వైసీపీ బాగుపడదని బాబు తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఇంతటి నీతిమాలిన రాజకీయం నా చరిత్రలో చూడలేదని అన్నారు. ఇక మీదట వైసీపీని అంతా మరిచిపోవాలని, రాష్ట్రానికి ఆ పార్టీ పీడ విరగడవ్వాలని బాబు గట్టిగా కోరారు. మావిగన్ అంటూ ఓ కొత్త ప్రతిపాదన చేశారని, డిక్షనరిలో చూశాను నాకు అర్థం కాలేదని బాబు సెటైర్లు వేశారు. వైసీపీవి అన్నీ బుద్ది లేని వ్యాఖ్యలు అలాగే దుర్మార్గపు ఆలోచనలేనని చంద్రబాబు మండిపడ్డారు.