డిజిట‌ల్ విప్ల‌వ‌మా? హ‌క్కుల హ‌ర‌ణ‌మా? సోనీపై గేమ‌ర్స్ ఫైరింగ్!

వ్యాపారాలు కాలంతో పాటు మారడం సహజమే అయినా.. వినియోగదారుల నమ్మకాన్ని పణంగా పెట్టి చేసే మార్పులు బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తాయి.

Update: 2026-07-03 03:49 GMT

డిజిటల్ భవిష్యత్తు వైపు అడుగులు వేయడం.. మారుతున్న అభిరుచికి అనుగుణంగా మార‌డం.. కంపెనీకి లాభదాయకమే అయినా వినియోగదారులకు `గేమ్స్ యాజమాన్య హక్కు` లేకుండా చేయడం ఎంతవరకు సమంజసం? డిజిటల్ లైసెన్స్‌లు ఎప్పుడైనా రద్దయ్యే ప్రమాదం ఉన్న ఈ రోజుల్లో.. ఫిజికల్ గేమింగ్ డిస్కుల‌ను పూర్తిగా రద్దు చేయడం వల్ల వినియోగదారుల నమ్మకం దెబ్బతినదా? ఇప్పుడు సోనీ చేసిన ప‌నికి క‌స్ట‌మ‌ర్లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ఇది `దారుణ మోసం` అంటూ సోష‌ల్ మీడియాల్లో డిబేట్లు పెడుతున్నారు.

గేమింగ్ రంగంలో `డిజిటల్ ఓనర్‌షిప్` అనేది ఒక అపోహ మాత్రమేనని సోనీ గేమ‌ర్ల‌కు చెంప చెల్లుమ‌నిపించేలా చెప్ప‌డం చ‌ర్చ‌గా మారింది. మనం ఒక ఫిజికల్ డిస్క్ కొన్నప్పుడు.. ఆ వస్తువుపై మనకు పూర్తి హక్కు ఉంటుంది. కానీ డిజిటల్ మీడియాలో మనం కేవలం ఒక తాత్కాలిక `లైసెన్స్`ను మాత్రమే పొందుతాము. స్టూడియో కెనాల్ ఒప్పందం ముగిసిందనే కారణంతో సోనీ తన కస్టమర్ల లైబ్రరీల నుండి వందలాది డిజిటల్ సినిమాలను రీఫండ్ లేకుండా తొలగించడం తీవ్ర ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది. రేపు గేమ్స్ విషయంలోనూ ఇదే జరిగితే.. వినియోగదారులు తాము భారీగా డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన డిజిటల్ కలెక్షన్స్ మొత్తాన్ని ఒకే రాత్రిలో కోల్పోయే ప్రమాదం ఉంది.

ఫిజికల్ డిస్క్‌లు లేకపోవడం వల్ల గేమింగ్ మార్కెట్లో ఆరోగ్యకరమైన పోటీ పూర్తిగా అంతరించిపోతుంది. ఫిజికల్ మీడియా అందుబాటులో ఉన్నప్పుడు అమెజాన్, ఇతర రిటైల్ స్టోర్స్ లేదా సెకండ్ హ్యాండ్ మార్కెట్ ద్వారా గేమర్స్‌కు తక్కువ ధరకే గేమ్స్ లభించే అవకాశం ఉంటుంది. కానీ కేవలం డిజిటల్ మాత్రమే అందుబాటులో ఉంటే.. సోనీ తన ప్లేస్టేషన్ స్టోర్ లో నిర్ణయించిన పూర్తి మోనోప‌లీ ధరకే గేమర్స్ కొనాల్సి వస్తుంది. ఇది వినియోగదారులపై మోయలేని ఆర్థిక భారాన్ని మోపుతుంది.

ఈ నిర్ణయం వల్ల గేమింగ్ ప్రపంచంలో ఎంతో కాలంగా ఉన్న బారోయింగ్, లెండింగ్, రీసేల్ సంస్కృతి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. ఇంత‌కుముందు మధ్యతరగతి లేదా తక్కువ బడ్జెట్ ఉన్న గేమర్స్ ఒకరు కొన్న డిస్క్‌ను మరొకరు మార్చుకుని ఆడుకునే వీలుండేది.. లేదా పాత గేమ్స్ అమ్మి కొత్తవి కొనేవారు. డిజిటల్-ఓన్లీ విధానం వ‌స్తే భవిష్యత్తులో ఈ స్వేచ్ఛ ఉండదు కాబట్టి ముఖ్యంగా యువ గేమర్స్ .. తక్కువ ఆదాయం ఉన్నవారు సరికొత్త గేమింగ్ అనుభవాలకు దూరమయ్యే ప్రమాదం ఉంది.

కస్టమర్ల నమ్మకం- బ్రాండ్ లాయల్టీపై దెబ్బ:

వ్యాపారాలు కాలంతో పాటు మారడం సహజమే అయినా.. వినియోగదారుల నమ్మకాన్ని పణంగా పెట్టి చేసే మార్పులు బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తాయి. ఎన్నో ఏళ్లుగా ప్లేస్టేషన్‌ను ఆదరిస్తూ.. ఫిజికల్ గేమ్స్ సేకరించే `కలెక్టర్లు` సోనీ తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తాము కేవలం ఒక `సేవ` కోసం మాత్రమే డబ్బులు కడుతున్నామని... వస్తువుపై హక్కు లేదని గ్రహించినప్పుడు బ్రాండ్ పై కస్టమర్ లాయల్టీ తగ్గిపోతుంది. ఇది భవిష్యత్తులో రానున్న‌ ప్లేస్టేషన్ 6 (PS6) వంటి కన్సోల్స్ అమ్మకాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంద‌ని క‌స్ట‌మ‌ర్లు వాదిస్తున్నారు.

దీనిని ఆప‌లేం కానీ..!

డిజిటల్ విప్లవాన్ని ఆపడం ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు.. కానీ ఫిజిక‌ల్ డిస్కుల‌ను పూర్తిగా రద్దు చేయడం ఎంతమాత్రం సమంజసం కాదనే వాద‌న నెటిజ‌నుల్లో ఉంది. కస్టమర్లకు ఫిజికల్ - డిజిటల్ అనే రెండు ఆప్షన్లను ఎంచుకునే స్వేచ్ఛను ఇవ్వడమే సరైన వ్యాపార పద్ధతి. అలా కాకుండా భౌతిక డిస్కుల‌ను పూర్తిగా లేకుండా చేయాల‌ని చూడటం కేవలం కంపెనీల లాభాపేక్షను, మార్కెట్‌ను పూర్తిగా తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలనే కార్పొరేట్ వ్యూహాన్ని మాత్రమే చూపిస్తుంది. వినియోగదారుల హక్కులను గౌరవించని ఏ సాంకేతిక మార్పైనా భవిష్యత్తులో తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తుంద‌ని నెటిజ‌నులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Tags:    

Similar News