పెట్రోల్ ధరలు తగ్గింపుపై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు !

దేశంలో ఇపుడు అందరినీ దొలిచేస్తున్న ప్రశ్న ఒక్కటే. పెట్రోల్ ధరలు తగ్గుతాయా లేదా అని. ఎందుకంటే ఇపుడు టూ వీలర్ అన్నది సామాన్యుడి రధం.

Update: 2026-07-03 03:40 GMT

దేశంలో ఇపుడు అందరినీ దొలిచేస్తున్న ప్రశ్న ఒక్కటే. పెట్రోల్ ధరలు తగ్గుతాయా లేదా అని. ఎందుకంటే ఇపుడు టూ వీలర్ అన్నది సామాన్యుడి రధం. దానితోనే జీవితం మొత్తం ఆధారపడి ఉంది. అందుకే పెట్రోల్ ధరలు పెరిగితే సగటు జీవి గుండె బద్ధలు అవుతోంది. పోనీ గల్ఫ్ యుద్ధం జరుగుతోంది కదా సర్దుబాటు చేసుకుందామని భారాన్ని మోసారు, ఓపిక పట్టారు, కానీ గల్ఫ్ యుద్ధం ఆగి చాలా రోజులు అయింది. కానీ పెట్రోలు డీజిల్ చార్జీలు మాత్రం తగ్గడం లేదు, దీని మీద సామాన్యుడు అయితే ఆవేదనతో ఉన్నాడు, ఆగ్రహంగా కూడా ఉన్నాడు, దాంతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. అంతే కాదు అసహనం వేదన కూడా కలుగుతున్నాయి.

సూటిగానే ప్రశ్న :

దీని మీద కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని ఢిల్లీలో మీడియా సూటిగానే ప్రశ్నించింది. పశ్చిమాసియాలో యుద్ధం ముగిసింది. ఇరాన్ అమెరికాల మధ్య కూడా చర్చలు జరుగుతున్నాయి కదా ఇక అంతర్జాతీయంగా చమురు ధరులు తగ్గిపోతున్నాయి కదా అని గుర్తు చేస్తూ దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయా అని ప్రశ్నించింది. అయితే దీని మీద పూరి అయితే అసలు తగ్గే ప్రసక్తే లేదని తేల్చేశారు. ప్రస్తుతానికి ఆ ఉద్దేశ్యం అయితే లేదని కూడా స్పష్టంగా చెప్పేసారు. కొన్ని వారాల పాటు అంతర్జాతీయంగా ముడు చమురు ధరలను పరిశీలిస్తామని చెప్పారు. అక్కడ ధరలు స్థిరంగా ఉంటే కనుక ప్రభుత్వం కూడా అపుడు ధరలను తగ్గించే ఆలోచన చేస్తుందని పూరీ కుండబద్ధలు కొట్టారు.

వారంతా నష్టపోయారు :

ఇక ఇరాన్ యుద్ధం జరిగిన నాటి నుంచి జూన్ 30 దాకా చూస్తే దేశంలో చమురు కంపెనీలు అన్నీ నష్టపోయాయని పూరీ చెప్పడం విశేషం. ఆ నష్టం ఏకంగా 74,781 కోట్ల రూపాయలుగా ఆయన వెల్లడించారు. ఇక అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా దేశీయ చమురు కంపెనీలు మాత్రం నష్టాలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. దానికి కారణం చమురు కంపెనీలు ఇంకా గతంలో యుద్ధం సమయంలో అధిక ధరలకు కొనుగోలు చేసిన క్రూడాయిల్‌నే ఇంకా ప్రాసెస్ చేస్తున్నాయని ఆయన చెప్పారు. అలా చూస్తే దేశీయ కంపెనీలు అన్నీ రెండు నెలల ముందు వరకూ ముడి చమురు కొంటాయని ఆయన చెప్పారు. అందువల్ల ఆ అధిక ధరలు అన్నీ బాలెన్స్ అయిన తరువాతనే ఏమైనా ధరలు తగ్గే అవకాశం ఉంటుంది అన్నట్లుగా కేంద్ర మంత్రి ఉన్నది ఉన్నట్లుగా చెప్పేశారు. ఇక ఈ రోజుకు అయితే చమురు ధరలు తగ్గే ప్రసక్తే లేదని తేల్చేశారు.

నియంత్రణలో ఉంచామంటూ :

మరో వైపు చూస్తే పశ్చిమాసియా సంక్షోభ సమయంలో పరిస్థితులను భారత్ సమర్థవంతంగా నిర్వహించిన తీరు గురించి ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వం చాలా కాలం పాటు పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రణలో ఉంచిందని పూరీ చెబుతున్నారు. అదే విధంగా వాటిపై విధించే పన్నులను తగ్గించిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యతనిచ్చిందని ఆయన అంటున్నారు. ఇక గత నాలుగేళ్లలో పెట్రోల్ ధర కేవలం 5.58 శాతం, డీజిల్ ధర 6.23 శాతం మాత్రమే పెరిగాయని కేంద్ర మంత్రి చెప్పడం విశేషం.

Tags:    

Similar News