అరకు మీద జనసేన జెండా...వైసీపీకి షాకేనా ?

ఏపీలో ఎక్కువగా ఎస్టీ అసెంబ్లీ సీట్లు ఉన్న ప్రాంతం ఉత్తరాంధ్రా. ఇక ఎస్టీ ఎంపీ సీటు కూడా ఉంది. ఎస్టీ నియోజకవర్గాలలో రాజకీయ ప్రాబల్యం మొదటి నుంచి కాంగ్రెస్ ది రాజకీయ ఆధిపత్యంగా ఉంటూ వచ్చింది.

Update: 2026-07-02 22:30 GMT

ఏపీలో ఎక్కువగా ఎస్టీ అసెంబ్లీ సీట్లు ఉన్న ప్రాంతం ఉత్తరాంధ్రా. ఇక ఎస్టీ ఎంపీ సీటు కూడా ఉంది. ఎస్టీ నియోజకవర్గాలలో రాజకీయ ప్రాబల్యం మొదటి నుంచి కాంగ్రెస్ ది రాజకీయ ఆధిపత్యంగా ఉంటూ వచ్చింది. ఆ తరువాత విభజన నేపథ్యంలో కాంగ్రెస్ బలం అంతా వైసీపీకి మళ్ళింది. అలా వైసీపీకి గడచిన మూడు ఎన్నికల్లోనూ ఎస్టీలు పట్టం కట్టారు. మరీ ముఖ్యంగా అరకు ఎంపీ సీటు వైసీపీకి కంచుకోటగా నిలిచింది. 2024 ఎన్నికల్లో కూటమి మూడు పార్టీలు ఒక్కటిగా నిలిచినా కూడా వైసీపీ అరకు ఎంపీ సీటు రెండు ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. ఇక అరకు పార్లమెంట్ పరిధిలో అరకు, పాడేరు, పాలకొండ, పార్వతీపురం, కురుపాం, సాలూరు, రంప చోడవరం అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో పార్వతీపురం ఎస్సీ సీటు తప్పించి మిగిలిన ఆరు ఎస్టీ నియోజకవర్గాలే. వైసీపీకి 2024లో తప్పించి మిగిలిన ఎన్నికల్లో ఈ సీట్లలో కూడా విజయం దక్కింది. టీడీపీ ఎన్నో ఎన్నికల్లో వైసీపీని ఢీ కొట్టింది. కానీ ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలలో అయితే గెలుపు దక్కలేదు. ఇపుడు జనసేన అరకు ఎంపీ పరిధిలో అన్ని అసెంబ్లీ సీట్లను గెలుచుకుంటామని గట్టిగా చెబుతోంది.

జనసేన వ్యూహమేంటి :

జనసేనకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణ. జనసేనకు ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాలోనే బలం ఉంది అని చెబుతారు. అది కూడా 2019, 2024 ఎన్నికల్లో రుజువు అయింది. అయితే 2024 ఎన్నికలలో గెలిచి కూటమి ప్రభుత్వంలో చేరిన తరువాత జనసేన వ్యూహం మార్చింది. ఎస్టీ రిజర్వుడు సీట్ల మీద ఫోకస్ పెంచింది. దాంతో జనసేన ఇక్కడ పట్టు పెంచుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ అనేక సార్లు అరకు పాడేరులలో పర్యటించారు. అంతే కాదు పాలకొండ వెళ్లారు, పార్వతీపురం కూడా తిరిగారు. ఇక గిరిజన ప్రాంతాలకు నిధులు కేటాయించి రోడ్ల నిర్మాణానికి కూడా పవన్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా కీలక చర్యలు తీసుకున్నారు. పవన్ ఏజెన్సీ పర్యటనకు వచ్చినపుడల్లా గిరిజన యువతతో కలిసి పోతున్నారు. గిరిజన మహిళలతో పాటు వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించడం రచ్చ బండ సమావేశాలు నిర్వహించడం వంటివి చేస్తున్నారు.

అనుకూలిస్తుందని భావించి :

ఇదిలా ఉంటే పవన్ అరకు మీద చూపిస్తున్న అభిమానం అలాగే ప్రభుత్వం తరఫున చేస్తున్న సాయం, అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా జనసేన అరకు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జనసేనకు బలం ఇస్తాయని భావిస్తున్నారు. అంతే కాదు గిరిజన యువత కూడా ఎక్కువగా జనసేన పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. ఈ మధ్య కాలంలోనే కీలక నేత కాంగ్రెస్ నుంచి జనసేనలో చేరిపోయారు. ఇలా అనేక మంది యువతరం నేతలు కూడా జనసేన తీర్థం పుచ్చుకున్నారు. దాంతో జనసేనలో ఆశలు పెరుగుతున్నాయని అంటున్నారు.

నాగబాబు కీలక వ్యాఖ్యలు :

మరో వైపు చూస్తే అల్లూరి జిల్లా జనసేన పార్టీ పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న నాగబాబు పార్టీ నేతలతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో అరకు పార్లమెంట్ పరిధిలోని మొత్తం సీట్లను జనసేన గెలుచుకోవాలని అన్నారు. అరకు ఎంపీ సీటు కూడా జనసేన పరం కావాలని అన్నారు. జనసేనకు ఏజెన్సీ ప్రాంతంలో పెరుగుతున్న ఆదరణతో పాటు ఉప ముఖ్యమంత్రిగా పవన్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు గిరిజనులకు అందుతున్న ఫలితాలు అన్నీ కూడా జనసేన విజయానికి బాటలు వేస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే అరకు పరిధిలో వైసీపీకి బలం గట్టిగానే ఉంది. మరి జనసేన రంగంలోకి దిగితే పవన్ సమ్మోహన శక్తితో గిరిజన ప్రాంతంలో రాజకీయ జాతకం మారుతుందా అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News