అమరావతి పెద్ద బాధ్యత....బాబు నవ నిర్మాత
రేపటి రోజున వైసీపీ అధికారంలోకి వచ్చినా ఆ దుస్సాహసానికి తెగించదు, చేయాలనుకున్నా చేయలేదు అని కూడా చెప్పవచ్చు.;
అమరావతి రాజధాని విషయంలో కూటమి ప్రభుత్వం పెద్ద బాధ్యతను తలకెత్తుకుంది. ఈ రాజధాని విషయంలో ఇప్పటిదాకా ఉన్న సంశయాలు శంకలు అన్నీ కూడా పార్లమెంట్ లో చట్టబద్ధత కోసం బిల్లు పాస్ కావడంతో తీరిపోయినట్లు అయింది. అమరావతిని ఎవరూ ఇంచ్ కూడా కదపలేరు అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు వాస్తవం. రేపటి రోజున వైసీపీ అధికారంలోకి వచ్చినా ఆ దుస్సాహసానికి తెగించదు, చేయాలనుకున్నా చేయలేదు అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అమరావతికి రాజ్యాంగ రక్షణ, న్యాయ పరమైన రక్షణ అన్నవి కవచ కుండలాలుగా ఉన్నాయి.
భారం అంతా :
ఇక అమరావతి విషయంలో భారం అంతా కూటమి ప్రభుత్వం మీద దాని సారధి చంద్రబాబు మీదనే ఉంది. అమరావతి కోసం వేలాది ఎకరాలను సేకరించారు. అక్కడ ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో భారీ ఎత్తున నిర్మాణాలు జరగాలి. ప్రభుత్వం అయితే అప్పులు తెచ్చో మరోటి చేసో సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు అలాగే మంత్రుల ఎమ్మెల్యేల క్వార్టర్స్ అన్నీ కూడా నిర్మాణం చేయగలదు. కానీ ప్రైవేట్ రంగానికి చెందిన వారికి ఇచ్చిన భూములలో సైతం వేగంగా నిర్మాణాలు జరగాలి. వారు కూడా అంతే తొందరగా అమరావతి మీద ఫోకస్ పెట్టి పని జరిపించాలి. అపుడే అమరావతికి ఒక రూపూ షేపూ వస్తుంది.
ఫ్లోటింగ్ పాపులేషన్ :
ఒక నగరం అభివృద్ధి అన్నది ఫ్లోటింగ్ పాపులేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ పాపులేషన్ ఎలా వస్తుంది అంటే వ్యాపార వాణిజ్య విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల మీద ఆధారపడిన వారు అక్కడికి వచ్చినపుడు. ఆ విధంగా చూస్తే అమరావతి రాజధాని ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు అందించే పరిశ్రమల స్థాపన జరగాలి. అలాగే అత్యుత్తమ విద్యా రంగ సంస్థలు కూడా అక్కడ ఏర్పాటు కావాలి అదే విధంగా వ్యాపార వాణిజ్య సంస్థలకు కేంద్రంగా మారాలి. అయితే ఇవన్నీ ఒక్క రోజులో జరిగిపోయేవి కావు. నెమ్మదిగా జరుగుతాయి. ఇక్కడ పాలకుల చిత్తశుద్ధి కూడా చాలా కీలకంగా ఉంటుంది అన్నది మరవరాదు. అదే సమయంలో ప్రభుత్వం అందించే
ప్రోత్సాహాలు ఉత్సాహం మద్దతు వారి ఒత్తిడి అన్నీ కలసి ఒక నగరంగా అమరావతి వేగంగా అడుగులు వేసేలా చేయగలవు అన్నది నిజం.
రైతులకు ప్లాట్లు :
ఇక ముందుగా రైతులకు నివాస వాణిజ్య ప్లాల్టు అందిస్తే అసలైన యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. అదే సమయంలో అమరావతి రాజధాని నుంచి పాలన జరగాలి అంటే మంత్రులు ఎమ్మెల్యే క్వార్టర్లలో అంతా అక్కడే ఉండేలా చూడాలి, అధికారులు సిబ్బంది సైతం అక్కడ నివసాలు ఏర్పాటు చేసుకుంటే కొత్త కళ వస్తుంది. ఈ విషయంలో అయితే కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితోనే ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇవన్నీ జరుగుతాయని చెప్పవచ్చు. మరో వైపు చూస్తే రాజకీయ విమర్శలు దాటి ఇపుడు అమరావతి రాజధాని రాజ్యాంగ రక్షణ లోకి వచ్చింది అన్నది అంతా గుర్తుంచుకోవాలి.
చూసేది కూటమి వైపే :
వైసీపీ తన స్టాండ్ ఏంటో చెప్పేసింది. అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదు అంటూనే అక్కడ అభివృద్ధి అన్నది లక్షల కోట్ల వ్యవహారం అని తేల్చేసింది. దాంతో వైసీపీని నిందించినా విమర్శించినా కూటమికి అదనంగా కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు, ఇక వైసీపీ వైఖరి మీద 2024 ఎన్నికల్లో తీర్పు ఇచ్చిన ప్రజలు 2029లో అదే స్టాండ్ మీద ఉంటారా లేదా అన్నది మరో మూడేళ్ళ తరువాత తెలుస్తుంది. సో వైసీపీ విషయంలో అయితే రాజధాని విషయంలో కూటమి అస్త్రాలు అన్నీ అయిపోయాయని చెప్పాల్సి ఉంటుంది.
చరిత్రలో నిలిచిపోతారు :
అదే సమయంలో వైసీపీ అసాధ్యం అన్న దానిని సుసాధ్యం చేస్తే కచ్చితంగా చంద్రబాబు నవ రాజధాని నిర్మాతగా చరిత్రలో నిలిచిపోతారు. ఈ విషయంలో ఎవరికీ దక్కని మహత్తర అవకాశం ఆయనకు దక్కింది. ఈ నవ రాజధాని నిర్మాణంలో తమ వాటా ఎంతో కొంత తీసుకోవడానికి వైసీపీకి అయిదేళ్ల పాటు అవకాశం వచ్చినా కూడా కాదనుకుంది. సో భారం అయినా బాధ్యత అయినా కీర్తి అయినా అన్నీ కూటమికే దక్కేలా సన్నివేశం అయితే ఇపుడు ఉంది. సో కూటమి వేసే అడుగులనే కేవలం అమరావతి వాసులే కాదు, అయిదు కోట్ల మంది ప్రజలు అంతా నిశితంగా గమనిస్తారు అన్నది గుర్తుంచుకోవాల్సి ఉందని అంటున్నారు.