లోక్ సభ సీట్లు పెంపు బిల్లు- ప్రత్యేక సమావేశానికి రెడీ
దేశంలో ప్రస్తుతం ఉన్న లోక్ సభ సీట్లను పెంచడం అన్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచనగా ఉంది.;
దేశంలో ప్రస్తుతం ఉన్న లోక్ సభ సీట్లను పెంచడం అన్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచనగా ఉంది. అదే సమయంలో 2026 నాటికి లోక్ సభ సీట్లు పెంచాల్సిన అవసరం ఉంది. ఈ మేరేకు గతంలో రాజ్యాంగ సవరణ జరిగింది. దాంతో ఈ గడువు తీరేలోగా కొత్త పార్లమెంట్ సీట్లను ప్రకటించాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. అందుకే లోక్ సభ సీట్లను పెంచేందుకు కేంద్రం సంసిద్ధంగా ఉంది. దాని కోసం కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను నిర్వహించాలని చూస్తోంది.
ముహూర్తం ఫిక్స్ :
ఇక ఈ నెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కేవలం లోక్ సభ సీట్ల పెంపు అన్న అజెండా కోసమే ఈ సమావేశాలు జరుగుతాయని చెబుతున్నారు. దీంతో ఈ నెలలోనే లోక్ సభ సీట్ల పెంపు అన్నది ఒక కొలిక్కి తీసుకుని రావాలని కేంద్రం చూస్తోంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే లోక్ సభలో మొత్తం 543 సీట్లు ఉన్నాయి. వీటిని ఏకంగా 750 నుంచి 848 దాకా పెంచాలన్నది కేంద్రం ఆలోచనగా ఉంది. అయితే దానికి ఏ ప్రతిపదికను అనుసరిస్తారు అన్నదే కీలకంగా మారుతోంది.
యాభై శాతం పెంపుతో :
ఇక జనాభా ప్రాతిపదికన అయితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే గడచిన యభై ఏళ్ల కాలంలో సౌత్ స్టేట్స్ అన్నీ ఎంతో నిబద్ధతతో జనాభా నియంత్రణను పాటించాయి. దాంతో ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలలో జనాభా తక్కువగా ఉంటోంది. అది అమలు అయితే చాలా ఎంపీ సీట్లకు కోత పడుతుంది. దానో కేంద్రం ప్రతిపాదించే లోక్ సభ నియోజకవర్గాల పునర్ విభజన బిల్లుకు ప్రతిపక్షాలు అన్నీ పూర్తి వ్యతిరేకంగా మారుతాయి. దాంతో బిల్లు పాస్ కావడం అనుకున్నంత సులభం కాదు, మరి యాభై శాతం అదనం సీట్లు అన్నది కనుక అందరికీ ఆమోదమేనా అంటే ఇందులో కూడా ఉత్తారాదికే ఎక్కువ లాభం అన్నది కాంగ్రెస్ ముఖ్యమంత్రి తెలంగాణాకు చెందిన నాయకుడు అయిన రేవంత్ రెడ్డి కొత్త చర్చను లేవనెత్తారు.
మధ్యే మార్గం ఉందా :
మరి ఈ రెండు ప్రతిపాదనలు అయితే ఇపుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇవి కాకుండా మధ్యేవాద మార్గం ఏమైనా ఉందా అన్నది కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు ఏ పాతిక ముప్పయి శాతమో అదనపు సీట్లు పెంపు చేసి దక్షిణాది రాష్ట్రాలకు మరీ ముఖ్యంగా జనాభా నియంతంత్రణను కఠినంగా అమలు చేసిన రాష్ట్రాలకు ఆ ఇరవై శాతం సీట్లు రాయితీగా ఇస్తేనే సమతూల్యత సీట్ల పెంపు విషయంలో ఉంటుందని అంటున్నారు. లేకపోతే దక్షిణాదికీ ఉత్తరాదికీ ఒకే విధంగా యాభై శాతం సీట్లు పెంచితే ఉత్తరాది రాష్ట్రాల్లో పెరిగిన సీట్లతోనే కేంద్ర ప్రభుత్వం ఎపుడూ ఏర్పాటు అవుతూ ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల పరంగా వెనక వరసలో ఉండడం వల్ల వారికి ప్రభుత్వ ఏర్పాటులో ఎలాంటి ప్రాధాన్యత అన్నది ఉండదని అంటున్నారు. మరి కేంద్రం ఏ విధంగా ఆలోచిస్తుందో విపక్షాలు ఏ రకాలైన సూచనలు చేస్తాయో తెలియదు, ఇవన్నీ తెలిస్తేనే అసలు ఎన్ని ఎంపీ సీట్లు పెరుగుతున్నాయి అన్న దాని మీద ఒక పక్కా క్లారిటీ రావచ్చు అని అంటున్నారు చూడాలి మరి ఏమి జరుగుతుందో.