త‌న‌ను తిట్టిన తిట్లు ఏమిటో చెప్పుకున్న మోడీ

Update: 2017-12-09 04:43 GMT
మోడీ అన్న వెంట‌నే.. వీరుడు.. శూరుడు.. మొన‌గాడు.. పోటుగాడు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే  విశేష‌ణాలు చెబుతారు. ఇక‌.. బీజేపీ నేత‌ల్ని అడ‌గాలే కానీ.. సాక్ష్యాత్ దైవంతో స‌మాన‌మ‌ని చెప్పేస్తుంటారు. అదే మోడీ గురించి ఆయ‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌ను అడిగితే.. నాన్ స్టాప్ గా తిట్టిన తిట్టు తిట్ట‌కుండా చెప్పే వారెంద‌రో. ఇలా మోడీని ర‌క‌ర‌కాల యాంగిల్స్ లో క‌నిపించేలా చేస్తుంటారు.

ఇదిలా ఉంటే.. ప్ర‌ధాని మోడీ తాజాగా ఆస‌క్తిక‌రంగా వ్య‌వ‌హ‌రించారు. త‌న‌కెంతో కీల‌క‌మైన గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల తొలిద‌శ పోలింగ్ కు ఒక రోజు ముందు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు త‌న‌ను ఎన్ని విధాలుగా తిడ‌తారో ఆయ‌నే స్వ‌యంగా చెప్పారు. మోడీ లాంటి మ‌హా నేత ఏమిటి.. త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు అర్థం లేకుండా తిట్టిన తిట్ల‌ను అప్ప‌జెప్ప‌టం ఏమిటి? అన్న సందేహం రావొచ్చు. మామూలుగా అయితే.. మోడీ అలాంటి ప‌ని చేసే వారు  కాదు.

కానీ.. ఆయ‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ తో పాటు.. బీజేపీ ఫ్యూచ‌ర్‌ ను డిసైడ్ చేసే గుజ‌రాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు కావ‌టంతో ఆయ‌న ఆ ప‌ని  చేయ‌క త‌ప్ప‌లేదు. ఇప్పటివ‌ర‌కూ ఎదురులేన‌ట్లుగా బండి న‌డిపిస్తున్న మోడీకి గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల రూపంలో పెద్ద అగ్నిప‌రీక్షే ఎదురైంది. వాస్త‌వానికి గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌లు స్టార్ట్ అయ్యే టైంలో బీజేపీకి తిరుగులేద‌న్న వాద‌న వినిపించింది. నాలుగైదు సీట్లు మిన‌హా.. మెజార్టీ విష‌యంలో పెద్ద వ్య‌త్యాసం రాద‌న్న అంచ‌నా బ‌లంగా వినిపించింది.

కానీ.. గుజ‌రాత్ ఎన్నిక‌ల వేడి రాజుకున్న త‌ర్వాత నుంచి ప‌రిణామాలు కాస్త మార‌టం మొద‌లైంది. అప్ప‌టివ‌ర‌కూ ధైర్యంగా ఉన్న బీజేపీ నేత‌ల‌కు వెన్నులో చ‌లిపుట్టే ప‌రిస్థితి. అంతేనా.. చివ‌ర‌కు మోడీ సైతం కాలికి బ‌ల‌పం క‌ట్టుకున్న‌ట్లుగా గుజ‌రాత్ లో తిర‌గ‌ట‌మే కాదు.. త‌న మాట‌ల్లో మ‌సాలాను అంత‌కంత‌కూ ద‌ట్టించేస్తున్నారు. అప్పుడెప్పుడో రెండున్న‌రేళ్ల క్రితం కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్ పాకిస్థాన్‌ కు వెళ్లి ఒక టీవీ ఛాన‌ల్‌ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూను ఇప్పుడు ప్ర‌స్తావిస్తున్నారు.

గుజ‌రాతీల్లో సెంటిమెంట్ రాజేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మీ బిడ్డ‌ను అన్నేసి మాట‌లు అంటున్నారు చూశారా? అన్న భావ‌న వారి మ‌న‌సుల్లో క‌లిగేలా చేస్తున్నారు.అందుకు నిద‌ర్శ‌నంగా మోడీ తాజా ప్ర‌సంగంగా చెప్పాలి. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు త‌న‌ను దారుణంగా మాట‌లు అనేస్తున్నార‌ని.. ప్ర‌ధాన‌మంత్రి అన్న గౌర‌వం లేకుండా వారి దూష‌ణ‌ల ప‌ర్వం సాగుతుంద‌న్న మాట‌ను చెప్పేశారు మోడీ. ఎందుకిలా? అంటే.. గుజ‌రాత్ లో వీస్తున్న మార్పుగాలిగా చెబుతున్నారు. మొద‌ట బీజేపీకి తిరుగులేద‌న్న‌ప్ర‌చారం జ‌రిగిన‌ప్ప‌టికీ.. రెండు ద‌శాబ్దాల‌కు పైగా ఒకేపార్టీ స‌ర్కారు రాష్ట్రంలో అధికార‌ప‌క్షంగా ఉండ‌టంతో ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో అసంతృప్తి పెరిగిపోయింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఈ భావ‌న పెరిగి.. గుజ‌రాత్ లో అధికారాన్ని కోల్పోతే మోడీకి జ‌రిగే న‌ష్టం అంతా ఇంతా కాదు. ఇప్ప‌టివ‌ర‌కూ  శూరుడు అన్నోళ్లే.. మోడీ ప‌ని అయిపోయింద‌ని చెప్ప‌టం ఖాయం. ఆయ‌న ఛ‌రిష్మా క‌రిగిపోయింద‌ని.. సొంత రాష్ట్ర ప్ర‌జ‌లే మోడీకి చెప్పేశార‌న్న దాడి పెర‌గ‌ట‌మే కాదు.. భ‌విష్య‌త్ రాజ‌కీయాల‌కు  గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంది. అందుకే.. గుజ‌రాతీల్లో సెంటిమెంట్‌ ను రాజేసి.. ఫ‌లితం త‌న‌కు అనుకూలంగా మార్చుకునే ప‌నిలో ప‌డ్డారు మోడీ.

అందులో భాగంగానే త‌న‌ను తిట్టిన తిట్ల‌ను అప్ప‌జెప్ప‌టం. తాజాగా పాల్గొన్న ఒక స‌భ‌లో మోడీ మాట్లాడుతూ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు త‌న‌ను ఎన్ని మాట‌లు అంటున్నారో చూడాలంటూ తిట్ల దండ‌కాన్ని అప్ప‌జెప్పారు. మ‌రి.. మోడీని ఆయ‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు ఏమేం తిట్టారో చూస్తే..

- పాము

- తేలు

- చాయ్‌ వాలా

- రక్తపిపాసి

- నీచ్‌

- పేడపురుగు

- పిచ్చికుక్క

- నపుంసకుడు

-  భస్మాసురుడు

- కోతి

-  ఔరంగజేబు

- పిచ్చివాడు

-  నిరక్షర కుక్షి

-  రావణుడు

- యమరాజు

-  మృత్యు బేహారి

-  రక్త దళారి

- విషపు సేద్యగాడు

-  రాక్షసరాజు

-  గడాఫీ

-  ముసోలినీ

-  మురికివాడు

-  వైరస్‌

-  గానుగ కార్మికుడు
Tags:    

Similar News