ప‌వ‌న్ ను దువ్వుతున్నారేంది చిన‌బాబు?

Update: 2018-04-27 10:41 GMT
ఇప్పుడు న‌డుస్తున్న దూకుడు రాజ‌కీయాల‌కు భిన్నంగా ఏపీ మంత్రి లోకేశ్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ఆస‌క్తిక‌రంగా మారింది. మాట‌కు మాట అనే రోజులు పోయి.. మాట‌కు నాలుగు మాట‌లు అన‌టం ఇప్పుడో అల‌వాటుగా మారింది. అలాంటి వేళ‌.. మాట అంటే అందుకు ధీటుగా మాట అనాల్సింది పోయి.. సాఫ్ట్ గా దువ్వుతున్న తీరు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

ఈ మ‌ధ్య‌న జ‌న‌సేన ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కుమారుడు క‌మ్ మంత్రి లోకేశ్ పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ‌టం తెలిసిందే. లోకేశ్ అవినీతి మీ దృష్టికి రాలేదా? అంటూ బాబును సూటిగా ప్ర‌శ్నించారు ప‌వ‌న్‌. ఈ స‌భ‌లో లోకేశ్ అవినీతిపై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.

ఈ సంద‌ర్భంగా లోకేశ్ అవినీతి మీద త‌న ద‌గ్గ‌ర ఆధారాలు ఉన్న‌ట్లుగా ప‌వ‌న్ వ్యాఖ్యానించ‌టం.. దీనిపై చిన‌బాబు తీవ్ర‌స్థాయిలో రియాక్ట్ కావ‌టం పాత మాట‌గా మారింది. ప‌వ‌న్ ఆరోప‌ణ‌ల‌కు ఆధారాలు చూపించాల‌ని గ‌ట్టిగా ప్ర‌శ్నించిన చిన‌బాబు.. ప‌వ‌న్ కు టైం ఇవ్వ‌టం తెలిసిందే. ఇదిలా ఉంటే.. త‌న ప‌ర‌ప‌తిని దెబ్బ తీసేలా మీడియా సంస్థ‌లు కొన్ని త‌న‌ను టార్గెట్ చేసేలా రూ.10 కోట్ల‌తో ఒక కుట్ర జ‌రిగిన‌ట్లుగా ప‌వ‌న్ ఆరోపించి సంచ‌లాన్ని సృష్టించారు.

మీడియా సంస్థ‌ల‌తో చేసిన కుట్ర‌లో లోకేశ్ కీరోల్ ప్లే చేసిన‌ట్లుగా ప‌వ‌న్ ఆరోపించారు. లోకేశ్ ముఖ్య‌పాత్ర‌ధారి అయితే.. టీవీ9 అధిప‌తులు.. మ‌రికొంద‌రు స‌న్నిహితుల‌తో త‌న‌పై బుర‌ద‌జ‌ల్లే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టార‌న్నారు.  గ‌తంలో త‌న‌పై ప‌వ‌న్ చేసిన అవినీతి ఆరోప‌ణ‌ల‌పై స్పందించినంత ఘాటుగా కూడా ఈసారి లోకేశ్ రియాక్ట్ కాక‌పోవ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఈ అంశంపై తాజాగా మాట్లాడిన లోకేశ్ ఊహించని రీతిలో రియాక్ట్ అయ్యారు. సాఫ్ట్ గా మాట్లాడుతున్న‌ట్లుగా మాట్లాడుతూ.. ప‌వ‌న్ త‌ప్పుడు దారిలో న‌డుస్తున్న‌ట్లుగా వ్యాఖ్యానించారు. ప‌వ‌న్ ను కొంద‌రు త‌ప్పుడు దారి ప‌ట్టించార‌ని.. ప‌వ‌న్ మంచోడ‌ని.. ఆయ‌న‌పై త‌న‌కు మంచి అభిప్రాయం ఉందంటూ బిస్కెట్లు వేయ‌టం గ‌మ‌నార్హం. లోకేశ్ తాజా వ్యాఖ్య‌లు ప‌వ‌న్ త‌న‌ను టార్గెట్ చేయ‌కుండా ఉండేలా.. త‌న‌పై కుట్ర ఆరోప‌ణ‌ల్ని ప్ర‌స్తావించ‌కుండా ఉన్నాయ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. త‌ప్పు లేన‌ప్పుడు.. మాట‌కుమాట అన్న‌ట్లుగా ఉండే తీరుకు భిన్నంగా లోకేశ్ నుంచి సాఫ్ట్ త‌ర‌హా వ్యాఖ్య‌లు ఎందుకు వ‌స్తున్న‌ట్లు చెప్మా..?
Tags:    

Similar News