వైసీపీ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు..కమిషనర్ పై వేటు

Update: 2020-04-10 09:50 GMT
అసలే కరోనా టైం.. దేశం రాష్ట్రం మొత్తం దీన్నుంచి ఎలా బయటపడాలనే దానిపై ఆలోచిస్తున్నాయి. కరోనా రోగులను గుర్తిస్తూ.. వారికి చికిత్సలు అందిస్తున్నాయి.. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఎంత బాధ్యతగా పనిచేయాలి.. కానీ ఏకంగా అవన్నీ గాలికి మరిచి ఏపీ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు నగరి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి. దీంతో ప్రభుత్వం ఆగ్రహించి సస్పెన్షన్ వేటు వేసింది.

తాజాగా నగరి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కరోనా టైంలో తమకు కావాల్సిన మాస్కులు కూడా ఇవ్వలేదని.. అన్ని అకౌంట్లు ఫ్రీజ్ చేశారని వెంకట్రామిరెడ్డి సెల్ఫీ వీడియోలో ఆడిపోసుకున్నారు. ఎమ్మెల్యే రోజా ఒక్కరే తమకు సహాయం చేశారని.. కావాల్సిన డబ్బు తాను ఇస్తానని హామీ ఇచ్చారన్నారు.

ఈ వ్యాఖ్యలపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. వెంటనే నగరి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసింది. అనుమతి లేకుండా నగరి నగరాన్ని వదిలివెళ్లకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పటివరకు ఓ ప్రభుత్వ డాక్టర్ కూడా ఇలానే ఏపీ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అతడిని సస్పెండ్ చేశారు. దానికి పచ్చ మీడియా చేసిన రచ్చ అంతా ఇంతాకాదు.. ఇప్పుడు మరో అధికారిపై వేటు విధించడం సంచలనమైంది.

అయితే నగరి సామాన్యుల మాట మరోలా ఉంది. 14 రోజులుగా నగరిలో కరోనా వైరస్ ను నియంత్రించడానికి అధికారులంతా కష్టపడుతున్నారని చెబుతున్నారు. మంత్రులు - కలెక్టర్ - ఇతర అధికారులంతా తిరుపతితో పాటు మంత్రుల నియోజకవర్గాల్లోనే కరోనా నియంత్రణకు పీపీఈ కిట్లు - మాస్కులు - శానిటైజర్లు - ఇతర వస్తువులు పంపిణీ చేస్తున్నారని.. 4 పాజిటివ్ కేసులు వెలుగుచూసిన నగరి నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. అందుకే తాజాగా నగరి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి బరస్ట్ అయినట్టు తెలుస్తోంది. దీనికి ఆయనను సస్పెండ్ చేయడంపై నగరి వాసుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టు తెలిసింది.
Tags:    

Similar News