కీసర ఎమ్మార్వో ఆత్మహత్య కాదు హత్యే..సంచలన ఆరోపణలు!

Update: 2020-10-17 06:00 GMT
తెలంగాణలోనే అత్యధిక లంచం తీసుకుంటూ దొరికిన కీసర తహసీల్దార్ నాగరాజు అర్ధాంతరంగా జైలులో ఆత్మహత్య చేసుకోవడం ఇటీవల సంచలనమైంది. దాదాపు 1.10 కోట్లు లంచం తీసుకున్న నాగరాజును అరెస్ట్ చేసి హైదరాబాద్ లోని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈనెల 14న నాగరాజు టవల్ తో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే పోలీసులు నాగరాజు ఆత్మహత్యపై కస్టోడియల్ డెత్ గా కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయన కుటుంబ సభ్యులు సైతం సంచలన వ్యాఖ్యలు చేస్తూ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది ఆత్మహత్య కాదు.. ముమ్మాటికీ హత్యేనంటూ ఆరోపించారు. సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటీషన్ వేస్తామని తెలిపారు. ఈ మేరకు నాగరాజు కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడారు.

ఎంతో మంది ఖైదీలు ఉండే జైల్లో ఆత్మహత్యచేసుకోవడం అంత సులభం కాదని.. అదీ టవల్ తో హ్యాంగిగ్ ఎలా చేసుకుంటారని.. పక్కన ముగ్గురు ఖైదీలు ఉండగా వాళ్లేం చేశారో చెప్పారని కుటుంబసభ్యులు నాగరాజు ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఏసీబీ కేసుల్లో వాస్తవం లేదని.. తగ్గ ఆధారాలు మా వద్ద ఉన్నాయని వారు ఆరోపించారు.

నాగరాజును ఉద్దేశపూర్వకంగానే ఈ కేసులో ఇరికించారని.. ఈ ఘటనపై హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని నాగరాజు కుటుంబ సభ్యులు హెచ్చరించారు. చనిపోవడానికి ముందు ఉదయం మాతో ఫోన్లో మాట్లాడాడని అన్నారు. త్వరలో వచ్చేస్తాను అన్నాడని.. ధైర్యంగా ఉండమన్నాడని.. అలాంటి నాగరాజు ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదని కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకునే ముందు రోజు ఏం జరిగిందన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. నాగారాజు ఎవరితో ఏం మాట్లాడారు? ఏం చెప్పారు.? కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Tags:    

Similar News