శత్రువులు కాస్తా స్నేహితులయ్యారే

Update: 2016-02-07 04:02 GMT
కాలం మా చిత్రమైంది. అందులోనూ రాజకీయాల్లో కాలం పోషించే కీలకపాత్ర మరేదీ పోషించదు. ఎప్పుడు ఎవరు ఎట్లా మారతారన్న విషయంలో కాలందే ప్రధానపాత్ర. ఒకవేళ అదే నిజం కాకపోతే.. కారాలు.. మిరియాలు నూరుకునే వారంతా ఒకే వేదికను పంచుకోవటం.. వారంతా కలిసి ఒక ఇష్యూ మీద గళం విప్పటం.. ఉమ్మడిగా పోరాడతామని పిడికిలి బిగించటం అంత తేలికైన విషయం కాదు. తాజాగా అలాంటి చిత్రమైన పరిణామం తెలంగాణ రాష్ట్ర పరిధిలోని మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకి వెళ్లే ముందు ఒక విషయాన్ని ప్రస్తావించి వెళ్లిపోతాం.

నాగం జనార్దనరెడ్డి.. డీకే అరుణ.. డాక్టర్ చిన్నారెడ్డి.. కొత్తకోట దయాకరరెడ్డి.. రావుల చంద్రశేఖర్ రెడ్డి పేర్లు విన్న వెంటనే.. వీరంతా కాంగ్రెస్.. తెలుగుదేశం నాయకులే కాక.. ఒకరంటే ఒకరికి పెద్దగా గిట్టదన్న విషయాన్ని మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాలపై ఏ మాత్రం అవగాహన ఉన్నా ఇట్టే చెప్పేస్తారు. మరి.. అలాంటి ఉప్పు..నిప్పు లాంటోళ్లంతా ఒకే వేదిక మీదకు రావటం.. జిల్లా ప్రయోజనాల కోసం పోరాడతామని పిడికిలి బిగించారంటే అది తెలంగాణ అధికారపక్షమైన టీఆర్ ఎస్ పుణ్యమేనని చెప్పక తప్పదు.

తెలంగాణ బచావో మిషన్ అధినేత.. మాజీ మంత్రి నాగం జనార్దనరెడ్డి తాజాగా ఒక పిలుపునిచ్చారు. బచావో పాలమూరు అంటూ పలు పథకాల్ని ఇతర జిల్లాలకు తరలిస్తున్నారని.. మహబూబ్ నగర్ జిల్లాను అన్యాయం చేస్తున్నారంటూ ఆందోళన చేస్తూ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్.. టీడీపీ నేతలు హాజరు కావటమే కాదు.. కల్వకుర్తి పథకాన్ని మళ్లిస్తున్నారని.. దిండి పథకం పేరుతో నల్లగొండకు 30 టీఎంసీల నీటిని మహబూబ్ నగర్ నుంచి తరలిస్తున్నట్లు ఈ నేతలు ఆరోపించటమేకాదు.. ఈ ప్రాజెక్టుల విషయమై తెలంగాణ అసెంబ్లీలో అధికారపక్షాన్ని నిలదీయాలని నిర్ణయించటం విశేషం. ఏది ఏమైనా విరుద్ద వైఖరులున్న నేతల్ని ఒకచోటకు చేర్చి జిల్లా ప్రయోజనాల కోసం తామంతా కలిసి పోరాడతామనేలా చేసిన క్రెడిట్ నాగంకు దక్కిందనే చెప్పాలి.
Tags:    

Similar News