నాగబాబు నామినేషన్.. ఆస్తులెంతో తెలుసా?

Update: 2019-03-23 05:10 GMT
తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేనాని.. అన్న నాగబాబు యాక్టర్ గానే ఉండి ఇన్నాళ్లు తెరవెనుక   జనసేనకు సపోర్ట్ గా నిలిచారు. సొంత యూట్యూబ్ చానెల్ పెట్టి జనసేనను విమర్శించిన వారి తాట తీశారు. కానీ అన్నయ్యపై అభిమానంతో ఇటీవలే పవన్ తన జనసేనలోకి నాగబాబును ఆహ్వానించాడు. కండువా కప్పి నర్సాపురం టికెట్ ఇచ్చి బీఫాం చేతిలో పెట్టాడు. ఇలా అన్నాదమ్ముల అనుబంధం జనసేన సాక్షిగా విచ్చుకుంది. ఇప్పుడు వీరిద్దరూ జనసేనను గెలిపించేందుకు రంగంలోకి దిగారు.

జనసేనాని పవన్.. భీమవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తుండగా.. అదే పార్లమెంట్ పరిధిలో ఉన్న నర్సాపురం నుంచి నాగబాబు ఎంపీగా నిలబడ్డారు. ఇప్పుడు ఇద్దరూ గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు. ఒకరినొకరు గెలిచేందుకు స్కెచ్ లు గీస్తున్నారు.

నాగబాబు శనివారం నర్సాపురం పార్లమెంట్ స్థానానికి జనసేన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్ లో తను - తన భార్య పేరిట ఉన్న ఆస్తుల చిట్టాను బయటపెట్టారు. తన కుంటుంబం పేర మొత్తం రూ.41 కోట్లు ఆస్తులున్నట్లు నాగబాబు అఫిడవిట్ లో చూపించారు.

నాగబాబు ఆస్తుల్లో చరాస్థులు రూ.36,73,50,722 కోట్లుగా చూపించారు.ఇక స్థిరాస్థులు రూ.4,22,74,477 కోట్లుగా చూపించారు. అదే విధంగా తనకు అప్పులు కూడా ఉన్నాయని నాగబాబు అఫిడవిట్ లో పేర్కొన్నారు. రూ.2,70,49,798 కోట్ల అప్పు ఉన్నట్టు పేర్కొన్నారు. ఒకప్పుడు సినీ నిర్మాతగా తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన నాగబాబు టీవీ షోలు - కొడుకు వరుణ్ హీరోగా మారాక వచ్చిన సంపాదనతో గట్టెక్కిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు రూ.41 కోట్ల ఆస్తులను చూపించడం విశేషం.



Tags:    

Similar News