తాను ‘వ్యాపారి’ని కాదన్న మురళీమోహన్

Update: 2016-08-30 07:48 GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించిన బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యల ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.  ఏపీ ఎంపీలపై ఒక స్థాయిలో విరుచుకుపడిన పవన్ కల్యాణ్.. తన మాటలతో ఎంపీలంతా వ్యాపారులు.. పారిశ్రామికవేత్తలుగా తేల్చేయటంతో పాటు.. వారికి ప్రజల కంటే కూడా వారి వ్యాపారాలే ముఖ్యమన్న విషయాన్ని స్పస్టం చేయటం తెలిసిందే. గతంలో ఏ విషయం మీదా పెద్దగా స్పందించే అలవాటు లేని నేతలంతా పవన్ వ్యాఖ్యలపై మాత్రం ఫైర్ అయినంత పని చేశారు.ఏపీ ఎంపీలంతా వ్యాపారులన్న రీతిలో మాట్లాడిన పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా కొంతమంది పేర్లను ప్రస్తావించారు. మరికొందరి పేర్లను ప్రస్తావించలేదు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పేరు పెట్టి మరీ విమర్శిస్తే స్పందించటంలో అర్థం ఉంది. కానీ.. పేరు ప్రస్తావించని ఎంపీలు సైతం రియాక్ట్ కావటం గమనార్హం. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన టీజీ వెంకటేశ్ ముచ్చటే చూద్దాం. ఆయనో బడా పారిశ్రామికవేత్త. కానీ.. ఆయన మాటను పవన్ ప్రస్తావించలేదు. కానీ.. ఎంపీలందరిపై చేసిన వ్యాఖ్యలపై టీజీ ఎంత వైల్డ్ గా రియాక్ట్ అయ్యారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా పవన్ వ్యాఖ్యలపై మరోఎంపీ స్పందించారు. సీనియర్ సినీ నటులు.. బడా పారిశ్రామికవేత్తగా తెలుగు ప్రాంతాల్లో సుపరిచితులు.. రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొచ్చేందుకు తాము కష్టపడుతున్నామని.. కేంద్రంలో మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఘర్షణపూరితంగా వ్యవహరించటంలేదన్నారు.

యూపీఏ హయాంలో ఎంపీలుగా వ్యవహరించిన వారిలో 75 శాతం మందికి వ్యాపారాలు ఉన్నాయని.. ఈసారి ఎంపీలుగా ఉన్న వారిలో వ్యాపారులు ఒక్కరున్నా చెప్పాలంటూ మురళీమోహన్ ప్రశ్నించటం గమనార్హం. ఏపీ ఎంపీల్లో వ్యాపారులు ఎంతమంది ఉన్న విషయాన్ని పవన్ చెప్పగా.. తాజాగా అందుకు భిన్నంగా మురళీమోహన్ వ్యాఖ్యలు చేయటం విశేషం. ఇదిలా ఉంటే.. తమలో వ్యాపారులు ఎవరూ లేరన్న విషయాన్ని చెప్పిన మురళీమోహన్ అంతలోనే.. తమలో కాంట్రాక్టర్లు ఎవరూ లేరని.. తమ వ్యాపారాలన్నీ భిన్నమైనవని చెప్పుకొచ్చారు. ఇంతకీ మురళీమోహన్ వ్యాపారా? కాదా?
Tags:    

Similar News