నేషనల్ పాలిటిక్స్‌ పై ముకేశ్ అంబానీ ఇస్తున్న ఇండికేషన్ ఏంటి?

Update: 2019-04-18 16:31 GMT
దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా టాప్ ప్రయారిటీ దక్కించుకునే అంబానీలు తెర వెనుక వ్యవహారాలు నడిపించడంలో.. సొంత ప్రయోజనాల కోసం పార్టీలకతీతంగా ప్రభుత్వాలను - నేతలను ఉపయోగించుకోవడంలో దిట్టలన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా యూపీయే ప్రభుత్వమైనా - ఎన్డీయే ప్రభుత్వమైనా తమ వ్యాపారాలకు ఏమాత్రం డోకా లేకుండ చూసుకునే ముకేశ్ అంబానీ ఎప్పుడూ అధికార స్థానాలకు చాలా దగ్గరగా ఉంటారు. ప్రధాని మోదీకి ప్రజలకు చేసిన మేలు కంటే అంబానీ - అదానీలకు చేసిన మేలు ఎక్కువని అంతా భావిస్తున్న తరుణంలో పెద్ద అంబానీ ముకేశ్ తాజాగా ఓ కాంగ్రెస్ నేతకు ఎన్నికల్లో సపోర్టు చేయడం అందరిలో ఆలోచనను రేకెత్తిస్తోంది. రానున్నది యూపీయే గవర్నమెంటు అన్న అంచనాలతోనే ఆయన మెల్లమెల్లగా తన స్టాండ్స్ మార్చుకుంటున్నారన్న వాదన ఒకటి మొదలైంది.
  
ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో దక్షిణ ముంబై నియోజక వర్గం నుంచి శివసేన అభ్యర్థి అరవింద్ సావంత్ తో కాంగ్రెస్ అభ్యర్థిగా మిలింద్ దియోరా తలపడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి దియోరాకు - రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తన మద్దతును తెలపడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 'దక్షిణ ముంబైను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం కలిగిన నాయకుడు దియోరా' అంటూ ఆయన ఒక వీడియోలో చెప్పుకొచ్చారు.
  
దక్షిణ ముంబై నుంచి పది సంవత్సరాల పాటు ప్రాతినిధ్యం వహించిన అనుభవం మిలింద్ దియోరాకు ఉందనీ - అక్కడి నియోజక వర్గంలోని సామాజిక - ఆర్ధిక - సాంస్కృతిక సమస్యలపై ఆయనకి మంచి అవగాహన ఉందనే అభిప్రాయాన్ని ముఖేష్ అంబానీ వ్యక్తం చేశారు. ఇక ఇదే వీడియోలో కొటాక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఉదయ్ కొటాక్ కూడా కనిపించారు. ఆయన కూడా మిలింద్ అభ్యర్థిత్వానికి మద్దతు పలికారు. ముంబైలో వ్యాపార వ్యవహారాలు పూర్వ స్థితికి చేరుకోవాలన్నా - యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగాలన్నా దియోరా వంటి సమర్ధుడైన నాయకుడు అవసరమంటూ ఆయన నాయకత్వ లక్షణాలను ప్రశంసిస్తూ మాట్లాడారు.
  
కాగా, సాధారణంగా ఏ ఎన్నికల్లోనూఎవరికీ మద్దతు తెలపకుండా తటస్థంగా వ్యవహరించే ముఖేష్ అంబానీ ఇలా ఒక అభ్యర్థికి మద్దతు తెలపడం ఒక విశేషం అయితే.. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం విషయంలో తన  సోదరుడు అనిల్ అంబానీపై నిత్యం దుమ్మెత్తిపోస్తున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థికి ఆయన మద్దతు ఇవ్వడం సంచలనంగా మారింది. ఈసారి ప్రభుత్వం మారుతుందన్న అంచనాలతో ఆయన స్టాండ్స్ మార్చుకున్నారా.. లేదంటే ముంబయి హైఫై సర్కిళ్లలో మంచి పట్టున్న మిళింద్ దేవ్‌రా కోసం వ్యక్తిగతంగా ఆయన ఈ స్టాండ్ తీసుకున్నారా అన్నది తెలియాల్సి ఉంది.
Tags:    

Similar News