భీమిలీ పిలుస్తోంది : మాజీ మంత్రి సీటు మీదే కన్ను...?

Update: 2022-05-26 00:30 GMT
ఆయన ఎంపీ. ఈయన మాజీ మంత్రి. ఇద్దరికి మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే అని అంటారు. వైసీపీలోనే ఇద్దరికీ పరిచయాలు ఉన్నాయి. అవి బలమైన  బంధాలుగా మారలేదు అని చెబుతారు. ఇక ఆయన విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అయితే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు. ఎంపీ గారికి ఇపుడు అసెంబ్లీ మీద మనసు పుట్టిందంట.

వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసి ఎమ్మెల్యే కావాలని అదృష్టం కలసివస్తే మంత్రి కూడా కావాలని ఆశిస్తున్నారు అని అనుచర గణం నుంచి వినిపిస్తున్న మాట. 2018లో వైసీపీఎలో చేరేంతవరకూ ఆయనకు రాజకీయ వాసనలు ఏవీ లేవు. ఆయన ఫక్తు వ్యాపారవేత్త. విశాఖలో పేరు మోసిన బిల్డర్ గా ఉన్నారు.

ఇక మూడేళ్ళ ఎంపీగా కూడా పెద్దగా విజయాలు అయితే లేవు. విశాఖ వంటి ప్రతిష్టాత్మకమైన సీటు నుంచి ఎంపీ అయినా స్మార్ట్ సిటీకి చేసిన గొప్ప మేలు ఏదీ లేదని అంతా అంటారు. ఇక వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీ సీటు నుంచి పోటీ చేయాలనుకున్నా ఆయనకు టికెట్ రాదు అని ప్రచారం మొదలైపోయింది. ఒక వేళ దక్కినా గెలుపు అందదు అని కూడా అంటున్నారు.

దాంతో ఈ ఎంపీ గారు ముందు జాగ్రత్తగా వేరే సీటు చూసుకున్నారనే చెబుతున్నారు. అదే సేఫెస్ట్ సీటు భీమిలీ అని చెబుతున్నారు. మరి భీమిలీ నుంచి మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఉన్నారు కదా. అంటే అధినాయకత్వం తలచుకుంటే ఆయన్ని ఎంపీగా పోటీ చేయమని ఆదేశించవచ్చు అని అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో అవంతి భీమిలీ నుంచి పోటీ చేస్తే నెగ్గే అవకాశాలు తక్కువ అని సర్వే నివేదికలు చెబుతున్నాయి. జగన్ వేవ్ లోనే కేవలం తొమ్మిది వేలతో బయటపడిన అవంతికి ఈసారి ఎన్నికలు గెలుపుని అందించలేవు అనే అంటున్నారు. దాంతో ఆయన్ని మార్చాలని వైసీపీలో చర్చ అయితే ఉంది. దీన్ని గమనించిన ఎంపీ గారు తనకో చాన్స్ అని వెంటపడుతున్నారు అని అంటున్నారు.

ఇక భీమిలీలో కాపుల డామినేషన్ ఎక్కువ. కమ్మ సామాజికవర్గానికి చెందిన ఎంవీవీకి టికెట్ ఇస్తే ఎంతవరకు నెగ్గుకురాగలరు అన్న మాట కూడా ఉంది. అదే టైమ్ లో ఆయన విశాఖ జిల్లా వాసి కాదు అన్న ప్రచారాన్ని కూడా విపక్షాలు మొదలెడతాయి. అవంతి కూడా స్థానికేతరుడు అయినా ఆయనకు సామాజికవర్గం దన్ను ఉంది. దాంతో ఎంపీ ఆశలు నెరవేరే సీన్ లేదని అంటున్నారు. కానీ ఈసారి ఎమ్మెల్యేగానే ఎంపీ  పోటీ చేస్తారు అని అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాల్సిందే.
Tags:    

Similar News