ఆ నలుగురు ఎవరు? ప్రాథమికంగా తేల్చేసిన జగన్ అండ్ కో?

Update: 2023-03-24 08:59 GMT
ఎమ్మెల్సీ ఎన్నికలు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కలిసి రావటం లేదా? ఎన్నిక ఏదైనా ఒకేలాంటి హవా ప్రదర్శించే జగన్ కు ఇప్పుడేమైంది? ఆయన మాటకు విలువ తగ్గిందా? ఆయన తన హవాను కోల్పోతున్నారా? అన్న సందేహాలు వ్యక్తమయ్యే పరిస్థితి. మొన్నటికి మొన్న మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో దారుణ పరాభవం కాగా.. తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విపక్ష టీడీపీకి నాలుగు ఓట్లు పోల్ కావటంతో టీడీపీ అభ్యర్థి అనురాధ సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. తమకు వ్యతిరేకంగా ఓటేసిన ఆ నలుగురిని తాము గుర్తించామని.. వారిపై చర్యలు టైం వచ్చినప్పుడు తీసుకుంటామని జగన్ కు అన్నీ తానైనట్లుగా వ్యవహరించే సజ్జల వెల్లడించటం తెలిసిందే.

ఇంతకీ ఆ నలుగురు ఎవరు? జగన్ ను దారుణంగా దెబ్బ తీసిన ఆ వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనిపై మల్లగుల్లాలు పడుతున్న జగన్ అండ్ కో.. వారెవరన్న విషయాన్ని ప్రాథమికంగా గుర్తించారని తెలుస్తోంది. తమను దెబ్బ తీసిన ఎమ్మెల్యేలు ఎవరన్న విషయాన్ని తేల్చేందుకు వీలుగా పోలైన ఓట్లను నిశితంగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. నిజానికి అలాంటి అవకాశం లేనప్పటికీ.. రివిజన్ పేరుతో ఆ ప్రక్రియను చేపట్టటం ద్వారా.. ఎమ్మెల్సీగా సంచలన విజయాన్ని సాధించిన పంచుమర్తి అనురాధకు పోలైన ఓట్లను చెక్ చేయగా.. తమకు దెబ్బేసిన ఎమ్మెల్యేలు ఎవరన్న విషయంపై అవగాహనకు వచ్చినట్లుగా తెలుస్తోంది.ఇంతకీ ఆ నలుగురు ఎవరన్న విషయంలోకి వెళితే..

1. నెల్లూరు రూరల్ వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. తాను ఆత్మప్రబోధానుసారం ఓటేసినట్లుగా చెప్పేశారు. టీడీపీ అభ్యర్థి విజయం సాధించినంతనే శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి నెల్లూరులోని వారి ఆఫీసు వద్ద టపాసులు కాల్చారు. దీంతో.. ఆయన తన ఓటును టీడీపీకి వేసి ఉంటారని తేలుస్తున్నారు.

2. సీనియర్ ఎమ్మెల్యే కమ్ వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి. దీనికి కారణం ఆయన నియోజకవర్గానికి వైసీపీ బాధ్యుడిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని పార్టీ నియమించింది. అసలు ఆనం పార్టీలో లేనట్లుగా అధినాయకత్వం భావిస్తోంది. తాజా ఎన్నికల్లో ఆయన వేయాల్సిన ఓటు గురించి వైసీపీ అధినాయకత్వం పట్టనట్లుగా వ్యవహరించింది. దీంతో.. ఆయన సైతం ఆత్మప్రభోధానుసారం ఓటేసినట్లుగా భావిస్తున్నారు.

3. సొంత పార్టీకి ఓటుతో దెబ్బేసిన మూడో ఎమ్మెల్యే సైతం నెల్లూరు జిల్లాకు చెందిన వారేనని భావిస్తున్నారు. సదరు సీనియర్ ఎమ్మెల్యేకు తాను వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వటం లేదని జగన్ తెగేసి చెప్పినట్లుగా తెలుస్తోంది. సదరు ఎమ్మెల్యే అడిగిన పనులు కూడా చేయలేదని.. చివరకు ఆయన కుటుంబంలోని ఒకరికి చిన్న పోస్టు అడిగినా ఇవ్వలేదని.. దీంతో గుర్రుగా ఉన్న అతను టీడీపీ అభ్యర్థికి ఓటేసి ఉంటారని భావిస్తున్నారు. అతడేమైనా టీడీపీకి ఓటేస్తారన్న సందేహంతో పోలింగ్ కు ఒక రోజు ముందు సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లగా.. ఆ సమయంలోనూ తాను వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేనని సీఎం జగన్ తేల్చేసినట్లుగా తెలుస్తోంది.
4

సదరు వైసీపీ ఎమ్మెల్యే ఓటును ఓటమి చెందిన వైసీపీ అభ్యర్థి జయమంగళ వెంకటరమణకు కేటాయించారు. తొలి ప్రాధాన్యం కింద మొత్తం 22 మంది ఎమ్మెల్యేల్ని కేటాయిస్తే.. ఒక ఓటు తగ్గింది. దీంతో.. ఆయనకు కేటాయించిన ఎమ్మెల్యేల్లో ఒకరు షాకిచ్చినట్లుగా భావిస్తున్నారు.

4. షాకిచ్చిన నాలుగో ఎమ్మెల్యే ఎవరన్న విషయానికి వస్తే.. కోస్తా జిల్లాకు చెందిన శాసనసభ్యుడిగా వైసీపీ అనుమానిస్తోంది. సదరు ఎమ్మెల్యేకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వనని సీఎం జగన్ స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. సదరు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు నిన్న (గురువారం) ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆ సమయంలోనూ వచ్చే ఎన్నికల్లో తాను టికెట్ ఇవ్వలేనని మరోసారి స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. సదరు ఎమ్మెల్యే ను కోలా గురువులకు కేటాయించారు. తొలి ప్రాధాన్యం కింద గురువులకు 22 ఓట్లు రావాల్సి ఉండగా.. అందులో ఒకటి తగ్గింది. అయితే.. రెండో ప్రాధాన్యత ఓట్లలో భాగంగా క్షేమంగా బయటపడ్డారు. ఈ ఎమ్మెల్యే కారణంగా కూడా నష్టం వాటిల్లిందన్న అభిప్రాయానికి పార్టీ వచ్చినట్లుగా చెబుతున్నారు.

Similar News