నేను బ‌రిలోకి దిగితే.. జానాకు థ‌ర్డ్ ప్లేసే!

Update: 2021-03-17 17:30 GMT
తెలంగాణ కాంగ్రెస్‌లో మ‌ళ్లీ కుమ్ములాట‌లు ప్రారంభ‌మ‌య్యాయి. నేత‌ల మ‌ధ్య ఎక్క‌డా స‌ఖ్య‌త లేద‌నే విష‌యం మ‌రోసారి స్ప‌ష్ట‌మైం ది. ఇప్ప‌టికే పార్టీ నానా విధ స‌మ‌స్య‌ల‌తో అల్లాడుతున్నా.. నేత‌లు మాత్రం త‌మ పంథాను వీడ‌డం లేదు. తాజాగా తెలంగాణ‌లోని నాగార్జున సాగ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి ఉప ఎన్నిక‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ విడుద‌ల చేసిన ద‌రిమిలా.. ఇక్క‌డ నుంచి పోటీ చేసేందుకు సీనియ‌ర్ నాయ‌కుడు - మాజీ మంత్రి జానారెడ్డి రెడీ అయ్యారు. గ‌త ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ అభ్య‌ర్థి నోముల న‌ర‌సింహ‌య్య‌‌పై ఓడిపోయిన జానాకు సానుభూతి ప‌వ‌నాలు వీస్తున్నాయ‌ని .. కాంగ్రెస్ భావిస్తోంది.

ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు ఇక్క‌డ టికెట్ ఇచ్చి గెలిపించుకునేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. అయితే.. ఇంత‌లోనే కాంగ్రెస్‌ లో కుమ్మ‌లాట‌లు తెర‌మీదికి వ‌చ్చాయి. జానారెడ్డిని సెంట్రిక్ చేసుకుని న‌ల్ల‌గొండ జిల్లాలోని మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై విజ‌యం సాదించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త‌న‌ను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నార‌ని.. దీనికి సంబంధించిన‌ సంప్రదింపులు జరుగుతున్నాయని వెల్లడించారు.అంతేకాదు.. నాగార్జునసాగర్‌ నుంచి పోటీ చేయాలని - కొన్నిరోజులుగా బీజేపీ నేతలు అడుగుతున్నారని తెలిపారు.

టీఆర్ ఎస్‌ ను గద్దె దించాలంటే బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. అయితే.. పోటీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తాను బీజేపీ నుంచి పోటీచేస్తే కాంగ్రెస్ నేత జానారెడ్డికి మూడో స్థానానికి పరిమితమవుతారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు.. ఎన్నిక‌ల ముంగిట తీవ్ర ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏదైనా ఉంటే.. అంత‌ర్గ‌త విష‌యాలు చ‌ర్చించుకోవాలే త‌ప్ప‌.. త‌మ అసంతృప్తుల‌తో మొత్తానికే కాంగ్రెస్‌ను తుడిచి పెట్టేసేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే కామెంట్లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం చేసిన వ్యాఖ్య‌లు.. గెలుపు అవ‌కాశంపై ప్ర‌భావం చూప‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.



Tags:    

Similar News