సీఎంపై సోషల్ మీడియా కామెంట్స్.. హెచ్ఎం సస్పెన్షన్!

అయితే సీఎం చంద్రబాబు విధానాలను వ్యతిరేకించిన హెచ్ఎం శ్రీనివాసరావు ముగ్గురు పిల్లలు కనమనటాన్ని ప్రశ్నిస్తూ అనుచిత వ్యాఖ్యలతో తన సోషల్ మీడియా అకౌంటులో పోస్టులు పెట్టారు.;

Update: 2026-04-09 13:56 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబును అవమానించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై వేటు పడింది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రభుత్వాధినేతను విమర్శించడమే కాకుండా క్రమశిక్షణను ఉల్లంఘించారనే ఆరోపణలతో సస్పెండ్ చేశారు. అంతేకాకుండా క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులకు లేఖ రాశారు. తీవ్ర సంచలనంగా మారిన ఈ ఉదంతం రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక బలమైన హెచ్చరికగా నిలుస్తోందని అంటున్నారు.

వాక్ స్వాతంత్రం పేరుతో ఉద్యోగులు రాజకీయ విమర్శలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేసిన మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గం తాళ్లూరు ఎంపీపీ పాఠశాల హెడ్మాస్టర్ దద్దాల శ్రీనివాస్ ని సస్పెండ్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ‘ఒక్కరు, ఇద్దరు కాదు... ముగ్గురు పిల్లలు ముద్దు’ అని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడాన్ని హెచ్ఎం శ్రీనివాసరావు తప్పుపడుతున్నారు. భవిష్యత్తులో దేశంలో వృద్ధుల జనాభా పెరిగిపోవడంతోపాటు జననాల రేటు తగ్గుదలపై ఆందోళన వ్యక్తం చేస్తూ సీఎం ముగ్గురు పిల్లలు కనాలని యువతను ప్రోత్సహిస్తున్నారు.

అయితే సీఎం చంద్రబాబు విధానాలను వ్యతిరేకించిన హెచ్ఎం శ్రీనివాసరావు ముగ్గురు పిల్లలు కనమనటాన్ని ప్రశ్నిస్తూ అనుచిత వ్యాఖ్యలతో తన సోషల్ మీడియా అకౌంటులో పోస్టులు పెట్టారు. ఇది బాగా వైరల్ అవడంతో గత ఏడాది డిసెంబరులో టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఇంచార్జి డీఈవో రేణుక విచారణ జరిపారు. ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు సర్వీస్ రూల్స్ అతిక్రమించారని నిర్ధారించి విధుల నుంచి సస్పెండ్ చేశారు. అదేవిధంగా సీఎంను కించపరిచిన నేరానికి టీచర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులకు లేఖ రాశారు.

ఈ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ గతంలోనూ ఒకరిద్దరు సోషల్ మీడియా పోస్టులు పెట్టగా, వెంటనే స్పందించిన ప్రభుత్వం వారిని సస్పెండ్ చేసింది. రాజధాని అమరావతి వరదల్లో మునిగిపోయిందని తిరుపతికి చెందిన ఓ అధికారి తప్పుడు ప్రచారం చేయగా వెంటనే దర్యాప్తు జరిపి వేటు వేసింది. అదేవిధంగా కొద్ది రోజుల క్రితం మధ్యాహ్న భోజనం సరిగా లేదని ఓ ఉపాధ్యాయుడు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేయడాన్ని గుర్తించి అతడిని సస్పెండ్ చేసింది. సోషల్ మీడియా పోస్టుల విషయంలో ప్రభుత్వం సీరియస్ గా నిర్ణయాలు తీసుకుంటున్నా, కొందరు ఉద్యోగులు తమ రాజకీయ ఆకాంక్షలను దాచుకోలేక ఇలాంటి పోస్టులతో బయటిపడిపోతున్నారని అంటున్నారు.

Tags:    

Similar News