6 ఏళ్లు...2లక్షల కోట్లు...15లక్షల ఉద్యోగాలు:కేటీఆర్

Update: 2020-09-24 17:35 GMT
తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే పలు పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు, అక్టోబరు 1వతేదీ నుంచి ఓటర్ల నమోదు ప్రక్రియ మొదలు కాబోతోంది. ఈ నేపథ్యంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఎన్నికల ఇంచార్జీలతో మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అక్టోబర్1 నుంచి జరిగే గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి ప్రైవేట్ రంగంలో 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించామని, వాటితో ఏర్పాటైన సంస్థల్లో సుమారు 15 లక్షల మందికి ఉపాధి కల్పించామని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో విపక్షాలు దివాళా తీశాయని,.ప్రతిపక్షాలకు ఎజెండా దొరకని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు

ఇప్పటికే వివిధ నియామక ప్రక్రియల ద్వారా దాదాపు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని కేటీఆర్ అన్నారు. నల్గొండలో 60 ఏళ్ల ఫ్లోరైడ్ రక్కసిని ఆరు సంవత్సరాల్లో తరిమేశామని, చుక్క తాగునీరు అందని అనేక పల్లెలు ఈరోజు జల సిరులతో కళకళలాడుతున్నాయని చెప్పారు. యాదాద్రి క్షేత్ర పునర్నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని, వరంగల్ జిల్లాకి మెగా టెక్స్టైల్ పార్క్, ఐటీ పరిశ్రమలు, టి హబ్, టాస్క్ కార్యకలాపాలు ప్రారంభిస్తామని అన్నారు. ఖమ్మం జిల్లా కి అక్టోబర్ నెలలో ఐటీ టవర్ ప్రారంభించే ప్రయత్నం చేస్తామని, బుగ్గపాడు ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ తో పాటు, మరిన్ని ఫుడ్ ప్రాసెసింగ్ పార్కుల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పంచాయతీ, మునిసిపల్, జడ్పీ, శాసనసభ, లోక్ సభ ఎన్నికల్లోనూ పార్టీ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
Tags:    

Similar News