కార్యకర్తపై దాడి చేసిన మంత్రి!

Update: 2023-01-28 10:35 GMT
సాధారణ వ్యక్తులు నాయకులు అవ్వడానికి, ఇంకా పెద్ద నేతలుగా ఎదగడానికి కార్యకర్తలే కారణం. అలాంటి కార్యకర్తలను నేతలు అధికారంలోకి వచ్చాక పట్టించుకోకపోవడమే దారుణమే. పట్టించుకోకపోతే పట్టించుకోకపోయారు కానీ తమను ఈ స్థాయికి చేర్చిన కార్యకర్తలపై దాడి చేయడం క్షమించరాని విషయం.

తాజాగా తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే నేతలు రెచ్చిపోతున్నారు. కార్యకర్తలపైనే దాడులకు దిగుతున్నారు. మూడు రోజుల క్రితం కూర్చుకునేందుకు కుర్చీ తీసుకురాలేదని పార్టీ కార్యకర్తలపై రాష్ట్ర మంత్రి ఎస్‌ఎం నాజర్‌ రాయి విసిరిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తీవ్ర వివాదాస్పదమైంది.

ఈ నేపథ్యంలో ఈ ఘటనను మరిచిపోకముందే తాజాగా మరో ఉదంతం చోటు చేసుకుంది. ఎస్‌ఎం నాజర్‌ తరహాలోనే మరో మంత్రి సైతం కార్యకర్తపై దాడికి పాల్పడటం తమిళనాట రాజకీయాల్లో కలకలం రేపుతోంది. మంత్రి ఎస్‌ఎం నాజర్‌ తరహాలోనే మరో మంత్రి కేఎన్‌ నెహ్రూ పార్టీ కార్యకర్తను మెడపట్టి నెట్టేసిన ఘటన ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

కాగా ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని ప్రముఖ పట్టణం సేలంలో జరిగిన డీఎంకే పార్టీ కార్యక్రమంలో రాష్ట్ర యువజన శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలను కలిసేందుకు ఆయన వేదికపై నిల్చుని ఉన్నారు. ఈ క్రమంలో కార్యకర్తలు వరుసలో వస్తూ ఆయనను కలిసి వెళుతున్నారు.

ఆయనకు శాలువాలు కప్పి కరచాలనం చేస్తున్నారు. ఇదే క్రమంలో ఓ కార్యకర్త ఉదయనిధి స్టాలిన్‌ కు శాలువా కప్పి కరచాలనం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో అక్కడే ఉన్న మున్సిపల్‌ శాఖ మంత్రి కేఎన్‌ నెహ్రూ ఆ కార్యకర్తను మెడ పట్టి తోసేశారు. ఇది వీడియోలో రికార్డు కావడంతో వైరల్‌ గా మారింది. మంత్రి నెహ్రూ తీరుపై కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రతిపక్షాలు సైతం ఈ ఘటనపై మండిపడుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ట్విటర్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ డీఎంకే మంత్రి ప్రజల్ని కొడతాను అని ప్రమాణం చేసినట్లున్నారని అన్నామలై ఎద్దేవా చేశారు. కొద్దిరోజుల క్రితం ఓ మంత్రి సైతం కార్యకర్తలపపై రాళ్లు విసిరాడని ఆయన గుర్తు చేశారు. తాజాగా మరో మంత్రి ప్రజల్ని తోసేస్తున్నారని మండిపడ్డారు. వీళ్లకు ఇది రోజువారీ కార్యక్రమంలా మారిందని అన్నామలై ధ్వజమెత్తారు. మంత్రుల నుంచి కాపాడుకునేందుకు ప్రజలకు రక్షణ కవచాలు అందించాలని  తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ను అన్నామలై కోరారు.    



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News