ఆ తప్పు మళ్లీ చేయొద్దు.. నన్ను 'రెడ్డి'గా మార్చకండి.. మంత్రి అమర్ నాథ్

Update: 2022-08-13 06:42 GMT
ఆసక్తికర వ్యాఖ్య చేశారు ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్. ఈ నెల 16న అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలోని ఎస్ఈజెడ్ (ప్రత్యేక ఆర్థిక మండలి/స్పెషల్ ఎకనామిక్ జోన్) లో ఏర్పాటు చేసిన ఏటీజీ టైర్ల కంపెనీ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాట్ల కోసం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ముందు.. ఆయన కంపెనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు ముఖ్యమైన  సూచన ఒకటి చేసి ఆశ్చర్యానికి గురి చేశారు.

ఈ మధ్యన తిరుపతిలోని అపాచీ కంపెనీ ప్రారంభం సందర్భంగా గుడివాడ అమర్నాధ్ ను పలువురు అమర్ నాధ్ రెడ్డిగా సంబోదించటం తెలిసిందే. గతంలో జరిగిన తప్పును తాజాగా ప్రారంభించే టైర్ల కంపెనీ ప్రారంభోత్సవంలో అలా జరగకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. తన పేరును గుడివాడ అమర్నాధ్ గా మాత్రమే పిలవాలని.. అమర్నాధ్ రెడ్డిగా పిలవకుండా.. తన పేరు విషయంలో అవగాహన కల్పించాల్సిందిగా కోరటం ఆసక్తికరంగా మారింది.

ఎవరికైనా తన పేరును కాకుండా.. దాని స్థానంలో మరేదైనా యాడ్ చేసినా.. పేరును తప్పుగా పిలిచినా ఇబ్బందికరంగా ఉంటుంది. మంత్రి అమర్నాధ్ మాటను ఇదే తీరులో తీసుకోవాల్సి ఉంటుంది.

జగన్ సర్కారులో ఎక్కువ మంది పేర్ల చివర ఉన్న రెడ్డి అనే పదం ఉండటంతో కొత్తగా ఉండేవారు.. మిగిలిన వారికి దాన్ని తగిలించేస్తున్న పరిస్థితి. అందుకే.. ప్రత్యేకంగా అధికారులకు తన పేరు మీద అవగాహన కలిగించే ప్రయత్నం చేశారు మంత్రి గుడివాడ అమర్నాధ్.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ కార్యక్రమానికి సంబంధించి ఎక్కడా కూడా కుర్చీలు ఖాళీగా ఉండకుండా చూసుకోవాలని మంత్రి నోటి నుంచి వచ్చిన మాటతో అధికారులు మరింత అలెర్టు అయ్యే పరిస్థితి. కంపెనీ ప్రతినిధులు ఎంతమంది వస్తారో తెలుసుకొని.. మిగిలిన కుర్చీల్ని పార్టీ కార్యకర్తలతో నింపాలన్న ఐడియా ఇచ్చారు మంత్రి అమర్నాథ్.
Tags:    

Similar News