మెగాభిమానుల మద్దతు జనసేనకే!

Update: 2022-05-22 11:30 GMT
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు తీవ్ర షాక్‌ ఇచ్చారు.. మెగాభిమానులు. తమ మద్దతు జనసేన పార్టీకే ఉంటుందని కుండబద్దలు కొట్టారు. మే 22న ఆదివారం కోస్తా జిల్లాల గుండెకాయలాంటి విజయవాడలోని ఓ హోటల్‌లో సమావేశమైన మెగాభిమానులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ అభిమానులతోపాటు మెగాస్టార్‌ చిరంజీవి, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ అభిమానుల మద్దతు కూడా జనసేన పార్టీకే ఉంటుందని విస్పష్టంగా ప్రకటించారు.

విజయవాడలో జరిగిన సమావేశానికి ఏపీలోని 26 జిల్లాల నుంచి అభిమానులు హాజరయ్యారు. అభిమాన సంఘాల అధ్యక్షులు వచ్చారు. అయితే పరిమిత సంఖ్యలో నిర్వహించిన సమావేశానికి అఖిల భారత చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి, చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వాహకుడు రవణం స్వామి నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

2024 ఎన్నికల్లో మెగాభిమానుల మద్దతు జనసేనకే ఉంటుందని స్వామి నాయుడు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మెగాభిమానులు జనసేన పార్టీ కోసం రంగంలోకి దిగుతారని చెప్పారు. జనసేన పార్టీ బలోపేతం కోసం క్షేత్ర స్థాయి నుంచి చర్యలు చేపడతామని.. పార్టీని పూర్తి స్థాయిలో పటిష్టం చేస్తామని వెల్లడించారు. త్వరలోనే పూర్తి స్థాయిలో అభిమానులతో జనసేన పార్టీ ముఖ్య నేతలు నాగ బాబు, నాదెండ్ల మనోహర్‌ సమావేశం నిర్వహిస్తారని చెప్పారు. వారిద్దరూ ఇచ్చే రోడ్‌ మ్యాప్‌ ఆధారంగా మెగాభిమానులు ముందుకు వెళతారని స్పష్టతనిచ్చారు.

2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయనపై అనేక కుట్రలు చేశారని.. అనేక అసత్యాలు, అబద్దాలు వ్యతిరేకులు ప్రచారం చేశారని రవణం స్వామినాయుడు మండిపడ్డారు. ఇప్పుడు కూడా ప్రజలకు సేవ చేద్దామని వచ్చిన పవన్‌ కల్యాణ్‌పై కుట్రలు చేస్తున్నారని.. అంతేకాకుండా ఆయనపై వ్యక్తిగతంగా దారుణ విమర్శలు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని మెగాభిమానులుగా చూస్తూ ఊరుకోబోమని.. అధికార వైఎస్సార్‌సీపీకి ఘోరీ కడతామని హెచ్చరించారు.

త్వరలోనే జనసేన పార్టీ కోసం మెగాభిమానుల కార్యాచరణ మొదలవుతుందని స్వామి నాయుడు వెల్లడించారు. ముగ్గురు హీరోలు (చిరంజీవి, రామ్‌ చరణ్, పవన్‌ కల్యాణ్‌) అభిమానులు మొత్తం కలసికట్టుగా జనసేన విజయానికి కృషి చేస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో.. సేవా కార్యక్రమాల నిర్వహణలో ముందుంటామని స్వామి నాయుడు వివరించారు. జనసేనను జనంలోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తామన్నారు. 2024లో పవన్‌ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేయడమే తమ లక్ష్యమని స్వామి నాయుడు స్పష్టం చేశారు.
4

ఇక జనసేన పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందనేది తమ పరిధిలోని అంశం కాదని.. పార్టీ పెద్దలు ఆ అంశాన్ని నిర్ణయిస్తారని వెల్లడించారు. పార్టీ నాయకులకు, అభిమానులకు మధ్య ఎలాంటి అంతరాలు లేవని తెలిపారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కుటుంబాలను కూడా వదిలిపెట్టి చిరంజీవి కోసం పనిచేశామని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా జనసేన కోసం సర్వం వదిలిపెట్టి పార్టీ విజయం కోసం పనిచేస్తామని స్వామి నాయుడు వివరించారు.

విజయవాడ సమావేశం మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని సమావేశాలు నిర్వహిస్తామని స్వామి నాయుడు తెలిపారు. ఆ తర్వాత మెగాభిమానుల కార్యాచరణ వెల్లడిస్తామని చెప్పారు. జనసేన అధికారంలోకి వచ్చేలా ప్రణాళికబద్ధంగా పనిచేస్తామని వెల్లడించారు. పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రి కావడం కోసం మెగాభిమానులు గట్టి సంకల్పంతో కృషి చేయాలని స్వామినాయుడు పిలుపునిచ్చారు.

దీంతో చిరంజీవికి, పవన్‌ కల్యాణ్‌కు మధ్య విబేధాలు సృష్టించాలని ప్రయత్నించిన వైఎస్సార్‌సీపీకి మెగాభిమానులు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చినటై్టంది. చిరంజీవికి సీఎం జగన్‌ ఎంతో గౌరవమిస్తున్నారని.. తామంతా ఆయన అభిమానులమని చెప్పుకొచ్చిన పేర్ని నాని, గుడివాడ అమర్‌నాథ్‌ లాంటి వాళ్లకి మెగాభిమానుల నిర్ణయంతో తీవ్ర ఝలక్‌ తగిలింది.
Tags:    

Similar News