మెగా మల్టీస్టారర్ : ఇద్దరూ ఒకే చోట.....డైరెక్షన్ ఎవరిదంటే...?

Update: 2022-07-02 06:34 GMT
టాలీవుడ్ లో మెగాస్టార్ మానియా ఏ రేంజిలో ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ఆయన తమ్ముడుగా వచ్చి తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్న పవర్ స్టార్ అంటే ఫ్యాన్స్ కి పూనకాలే వస్తాయి. ఈ ఇద్దరూ కలసి మల్టీస్టారర్ చేయాలని మెగా ఫ్యాన్స్ ఎపుడూ  ఆశపడుతూంటారు. కనీసం ఇద్దరూ కలసి ఒకే వేదికను ఎక్కినా చూసేందుకు రెండు కళ్ళూ చాలవని భావిస్తారు. కానీ బహిరంగ వేదికల మీద కూడా ఈ ఇద్దరూ కనిపించేది చాలా చాలా తక్కువ.

అలాంటిది ఈ ఇద్దరినీ ఒకే వేదిక మీదకు తీసుకువస్తున్న ఘనత అయితే కచ్చితంగా బీజేపీదే అనుకోవాలి. ఈ నెల 4న భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలని ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ సభకు ప్రముఖులను ఆహ్వానించారు. అలా టాలీవుడ్ తరఫున మెగాస్టార్ కి ఆహ్వానం అందించారు బీజేపీ పెద్దలు. ఇక బీజేపీ మిత్రపక్షంగా జనసేన  అధినేత హోదాలో పవన్ కూడా ఈ మీటింగునకు హాజరవుతారు.

అలా అటు మెగాస్టార్, ఇటు పవన్ స్టార్ లని ఒకే వేదిక మీద చూడడానికి మెగా ఫ్యాన్స్ ఇప్పటి నుంచే రెండు కళ్ళను అప్పగించేయవచ్చు. నిజంగా ప్రజారాజ్యం టైమ్ నుంచి చూస్తే ఒక రాజకీయ వేదిక మీద అన్నదమ్ములు ఇద్దరూ కనిపించి ఎరగరు. ప్రజారాజ్యానికి చిరంజీవి అధ్యక్షుడుగా ఉంటే యువరాజ్యం అధినేతగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. అలా కొన్నేళ్ళ పాటు రాజకీయాలను ఈ ఇద్దరు నడిపారు.

ఆ తరువాత చూస్తే ఒకటి రెండు సినీ ఫంక్షన్లలో తప్ప పవర్, మెగాస్టార్ కలసింది లేదు. కానీ బీజేపీ డైరెక్షన్లోనే ఇపుడు అంతా జరుగుతోంది. పవన్ని ఇప్పటికే తమ రాజకీయ  మిత్రుడిగా చేసుకున్న బీజేపీ మెగాస్టార్ ని కూడా అల్లూరి కార్యక్రమం పేరిట తమ వైపునకు తిప్పుకునేందుకు ఆలోచిస్తోంది  అంటున్నారు.  దానికి నాందిగా భీమవరం సభను వాడుకుంటున్నారా అన్న చర్చ కూడా ఉంది.

దీనితో పాటు అటు మెగా ఫ్యాన్స్ కి ఇటు జనాలకు మరో వైపు రాజకీయ పార్టీలకు కూడా మెగా సందేశాన్ని బీజేపీ ఈ సందర్భంగా వినిపించబోతోంది.  మెగా బ్రదర్స్ ఇద్దరూ తమ వైపే సుమా అన్న మెసేజ్ ని వారికి చేరేలా చూడడమే ఈ పిలుపులోని అసలైన వలపు అని అంటున్నారు.

మొత్తానికి చూస్తే అటు మెగాస్టార్ ఇటు పవర్ స్టార్, మధ్యన పొలిటికల్ స్టార్ ప్రధాని నరేంద్ర మోడీ ఊహించుకుంటేనే భీమవరం సభ అదరహో అన్న రేంజిలో అనిపిస్తోంది  కదా.
Tags:    

Similar News