రోడ్డు డాక్ట‌ర్‌.. మ‌న ప్రాణాల‌కు ర‌క్ష‌ణ‌!

Update: 2017-09-09 11:19 GMT
అవును కొంద‌రిని చూస్తే.. మ‌న‌కు తెలియ‌కుండానే మ‌న‌లో ఒక విధ‌మైన అభిమానం పుట్టుకు రాక‌మాన‌దు. రెండు చేతులూ ఎత్తి ద‌ణ్నం పెట్టాల‌ని అనిపించ‌కా మానదు. అలాంటి వ్య‌క్తులు చాలా అరుదుగా ఉంటారు. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే.. నూటికో.. కోటికో ఒక్క‌రు.. పురుషుల్లో పుణ్య‌పురుషుడు అన్న‌ట్టుగా ఉంటారు. అలాంటి వ్య‌క్తే.. క‌ట్నం గంగాధ‌ర తిల‌క్‌. వ‌య‌సు 67. ఈయ‌న ఓ సాధార‌ణ వ్య‌క్తి. అయితేనేం.. అసాధార‌ణ వ్య‌క్తిత్వాన్ని సొంతం చేసుకున్న వ్య‌క్తి కావ‌డం వ‌ల్లే.. ఇప్పుడిలా మ‌నం చ‌ర్చించుకునే స్థాయికి ఎదిగారు. మ‌రి ఆయ‌నెవ‌రో? ఆయ‌న స్థాయి ఏమిటో? ఎందుకు ఆయ‌న‌ను చూస్తే.. అంద‌రూ న‌మ‌స్క‌రించ‌కుండా వెళ్ల‌లేరో చూద్దామా?

ఏపీలో ని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో జ‌న్మించిన గంగాధ‌ర తిల‌క్‌.. దక్షిణ రైల్వేలో సీనియ‌ర్ సెక్ష‌న్ ఇంజ‌నీర్‌ గా దాదాపు 35 ఏళ్లు సేవ‌లందించి 2008లో రిటైర‌య్యారు. ఆ త‌ర్వాత కూడా ఆయ‌న హైద‌రాబాద్‌ లో సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ ఏజెన్సీలో క‌న్స‌ల్టెంట్‌ గా సేవ‌లందిస్తున్నారు. అయితే, ఆయ‌న అంద‌రిలాగా బ‌తికేయాల‌నుకోలేదు. ``మాన్ ఆఫ్ మిష‌న్‌``గా త‌న‌ను తాను మ‌లుచుకోవాల‌ని క‌ల‌లు గ‌న్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న స‌మాజ సేవ‌కు త‌న‌వంతు పాటుప‌డాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న వినూత్న ఆలోచ‌న‌ను కార్యాచ‌ర‌ణ రూపంలో అమ‌లు చేయ‌డం ప్రారంభించి అంద‌రి మ‌న్న‌న‌లూ పొందుతున్నారు.

భాగ్య‌న‌గ‌రిగా - విశ్వ‌న‌గ‌రిగా పేరు పొందిన హైద‌రాబాద్‌ లో ప్ర‌యాణం అంటే నిత్య‌న‌ర‌కం. రోడ్ల‌పై ఎక్క‌డ గుంత ఉంటుందో ? ఎక్క‌డ మ్యాన్‌ హోల్ ఉంటుందో చెప్ప‌డం క‌ష్టం. దీంతో ప్ర‌యాణించేవారు తీవ్ర ఇబ్బందులు ప‌డాల్సిందే. కొన్ని కొన్ని సార్లు ఈ గుంతల కార‌ణంగా వాహ‌నాల‌కు రోడ్డు ప్ర‌మాదాలు జ‌రిగిన సంద‌ర్భాలూ ఉన్నాయి. ప్రాణాలు కోల్పోయిన వారూ ఉన్నారు. వీటిని గ‌మ‌నించిన తిల‌క్‌.. తాను ప్ర‌యాణించే మార్గంలో రోడ్ల‌పై ఎక్క‌డ గుంత ఉంటే అక్క‌డ ఆగి..తాను స్వ‌యంగా త‌యారు చేసి తెచ్చిన కంక‌ర మిక్స్‌తో ఆ గుంత‌ను పూడి.. రోడ్డును మ‌ర‌మ్మ‌తు చేసి వెళ్తుండ‌డాన్ని త‌న హాబీగా చేసుకున్నారు.

2011లో మొద‌లైన ఈ సామాజిక సేవా యాత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న  దాదాపు 1200 గుంత‌ల‌ను స‌రిచేశారు. ఫ‌లితంగా రోడ్ల‌ను స‌రిచేయ‌డంతోపాటు అనేక ప్ర‌మాదాల‌ను త‌ప్పించ‌డం ద్వారా వంద‌ల కొద్దీ ప్ర‌మాదాల నుంచి ప్ర‌జ‌ల‌ను తిల‌క్ ర‌క్షించార‌నే చెప్పాలి. ఏదైనా రోడ్డుపై గుంత క‌నిపిస్తే.. ప్ర‌భుత్వానికి ఫిర్యాదు చేయ‌డం ఎవ‌రో వ‌చ్చి దానిని పూడ్చ‌డం వంటివి జ‌రిగేందుకు కొన్ని రోజులు ఒక్కొక్క‌సారి నెల‌లు కూడా స‌మ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది. ఫ‌లితంగా ప్ర‌మాదాలు జ‌రిగి ప్రాణాలు కోల్పోయే అవ‌కాశం ఉంది. దీంతో తిల‌క్ తానే స్వ‌యంగా కొంత వ్య‌యం స‌మ‌కూర్చి.. ఇలా  సామాజిక బాధ్య‌త‌ను నెత్తికెత్తుకుని ప్ర‌జాసేవ‌లో త‌రిస్తున్నారు.

ఈయ‌న కృషిని చూసి చాలా మంది చందాలు ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చారు. అయినాకూడా ఆయ‌న సున్నితంగా వాటిని తిర‌స్క‌రించారు. ఈయ‌న క‌ష్టాన్ని చూసిన భార్య అమెరికాలో ఉన్న త‌మ కొడుకుకు ఫిర్యాదు చేసింది. అయితే, తండ్రి మ‌న‌సు తెలుసుకున్న ఆ త‌న‌యుడు త‌న తండ్రికి బాస‌ట‌గా నిలిచేందుకు, ఆయ‌న కృషి ప‌దిమంది కీ తెలిసేలా.. శ్ర‌మ‌దాన్ పేరుతో ఓ సోష‌ల్ మీడియా పేజ్‌ ను క్రియేట్ చేశారు.  అంతేకాదు, జీహెచ్ ఎంసీ కూడా తిలక్ ప్ర‌య‌త్నానికి అబ్బుర‌ప‌డి ఆయ‌న‌తో క‌లిసి ప‌ని చేసేందుకు ముందుకు వ‌చ్చినా సున్నితంగా తిర‌స్క‌రించి.. త‌న ప‌ని తాను చేసుకు పోతూ.. మ‌న‌కు ర‌క్ష‌ణ నిస్తున్న నిజ‌మైన రోడ్డు డాక్ట‌ర్‌కి క‌నిపించిన‌ప్పుడు త‌ప్ప‌కుండా న‌మ‌స్కారం చెప్ప‌డం మ‌రిచిపోవ‌ద్దు సుమా!! 
Tags:    

Similar News