ఏం అసద్.. ఇలాంటి వాటికి సాయం చేయవే..?

Update: 2017-01-05 16:21 GMT
నోరు తెరిస్తే చాలు.. ముస్లిం ప్రజల ఉద్దరణ కోసమే పుట్టినట్లుగా స్పీచ్ లు ఇచ్చేస్తుంటారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. నిజంగా ఆయనకు ముస్లిం మైనార్టీల మీదా.. వారు బాగుపడాలన్న కమిట్ మెంట్ ఉండి ఉంటే.. ఈ రోజుకీ ఓల్డ్ సిటీ ఇప్పుడున్నట్లుగా మాత్రం ఉండేది కాదన్నది నిజం. ఇప్పటికి ఇరుకు సందులు.. పేదరికం తాండవిస్తూ.. మౌలిక సదుపాయాల కల్పనలో ఎంతో వెనుకబడినట్లుగా కనిపిస్తారు.

ముస్లింలను మొత్తంగా ఉద్దరించకపోయినా.. దేశం కాని దేశంలో ఇరుక్కుపోయి.. అక్రమంగా కేసుల్లో ఇరుక్కున్న అమాయకుల్ని రక్షించే విషయంలో అయినా కాస్తంత యాక్టివ్ రోల్ ప్లే చేస్తే బాగుంటుందన్న భావన వ్యక్తమవుతోంది. తాజాగా హైదరాబాద్ లోని మలక్ పేటకు చెందిన మన్సూర్ హుస్సేన్ అనే యువకుడు 2013 నుంచి రియాద్ లో పని చేస్తున్నాడు. ఎంబీయే చదివిన ఇతడు మార్కెటింగ్ ఆడిటర్ ఉద్యోగం చేస్తున్నారు.

గత సంవత్సరం ఆగస్టు 25న 1.06లక్షల సౌదీ రియాళ్లను తీసుకొని బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వెళుతున్నాడు. మధ్యలో దోపిడీ దొంగలు అడ్డుకొని అతడ్ని దోచేశారు. ఈ మొత్తాన్ని పోయిన విధం గురించి యజమానికి చెప్పగా.. అతడు పోలీసులకు ఫిర్యాదు చేయటం.. నేరం హుస్సేన్ మీద వేయటం జరిగింది. ఈ నేపథ్యంలో హుస్సేన్ కు ఏడాది జైలుశిక్షతో పాటు 300 కొరడా దెబ్బలు విధిస్తూ సౌదీ అరేబియా కోర్టు తీర్పును ఇచ్చింది.

తమ కొడుకును అన్యాయంగా కేసులో ఇరికించారని.. నిర్దోషి అని హుస్సేన్ తల్లిదండ్రులు వాపోతున్నారు. గతంలో అతను 15లక్షల సైదీ రియాళ్లు డిపాజిట్ చేశాడని.. చిన్న మొత్తానికి కక్కుర్తి పడే రకం కాదని వారు వాపోతున్నారు. ఏదో రకంగా తమ కొడుకును రక్షించాలని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ను.. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని కోరుతున్నారు. మరి.. ముస్లిం జనరుద్దరణకే పుట్టినట్లు చెప్పుకునే అసద్ ఈ ఇష్యూను పరిష్కరించే దిశగా చేసిన ప్రయత్నాలు ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News