పీకేకు భారీ షాక్‌!..జ‌న‌సేన‌కు మారిశెట్టి రాజీనామా!

Update: 2019-05-02 16:36 GMT
ఏపీలో ఇటీవ‌ల ముగిసిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అటు అధికార పార్టీ టీడీపీతో పాటు ఇటు విప‌క్ష వైసీపీకి స‌రిస‌మానంగా ప్ర‌చారం చేసిన కొత్త పార్టీ జ‌న‌సేన‌... విజేత‌ల విష‌యంలో చాలా చోట్ల కీల‌కంగా మారిపోయింది. ఈ విష‌యంలో ఎవ‌రు కాద‌న్నా - ఎవ‌రు ఔన‌న్నా.. జ‌న‌సేన‌ది కీల‌క రోల్ అనే చెప్పాలి. కాపు సామాజిక ఓట్లే ల‌క్ష్యంగా బ‌రిలోకి దిగిన జ‌న‌సేన‌... ఆ వ‌ర్గంలోని మెజారిటీ ఓట్ల‌ను త‌న ఖాతాలో వేసుకుని తీరుతుంద‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. ఇలా జ‌న‌సేన చీల్చే ఓట్లే... అటు టీడీపీకి అయినా - ఇటు వైసీపీకి అయినా కీల‌క‌మ‌ని చెప్పాలి. ఇలాంటి నేప‌థ్యం ఉన్న జ‌న‌సేన‌లో అప్పుడే ముస‌లం మొద‌లైపోయింది. ఎన్నిక‌ల్లో కీల‌క ఘ‌ట్ట‌మైన పోలింగ్ ముగిసినా... ఫ‌లితాలు మాత్రం ఇంకా వెల్ల‌డి కాలేదు. ఫ‌లితాల్లో తాము ఆశించిన సీట్ల కంటే కూడా మెజారిటీ సీట్ల‌ను సాధిస్తామ‌న్న ధీమాతో జ‌నసేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉన్నారు. ఇలాంటి నేప‌థ్యంలో పీకేకు భారీ షాకే త‌గిలింది. పార్టీ కోశాధికారిగానే కాకుండా పార్టీ వ్య‌వ‌స్థాప‌న‌లో కీల‌క భూమిక పోషించిన మారిశెట్టి రాఘ‌వ‌య్య పార్టీకి రాజీనామా చేసి పారేశారు.

ఈ మేర‌కు జ‌న‌సేన‌ అధినేత ప‌వ‌న్ కు మారిశెట్టి త‌న రాజీనామా లేఖ‌ను పంపారు. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తోనే తాను పార్టీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన‌ట్టుగా ఆ లేఖ‌లో మారిశెట్టి పేర్కొన్నారు. పేరుకే వ్య‌క్తిగ‌త‌మ‌ని చెబుతున్నా... మారిశెట్టి రాఘ‌వ‌య్య రాజీనామాకు చాలా కార‌ణాలే ఉన్నాయ‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. 2014 ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉండి... టీడీపీ, బీజేపీ కూట‌మికి ప‌వ‌న్ మ‌ద్ద‌తిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత కూడా టీడీపీతోనే చాలా కాలం పాటు సాగినా.. ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు ఆ పార్టీకి క‌టీఫ్ చెప్పేశారు. టీడీపీపై యుద్ధాన్నే ప్ర‌క‌టించారు. అయితే ఎన్నిక‌లకు రంగం సిద్ధ‌మైన త‌ర్వాత.... లోపాయికారీగా టీడీపీతో ప‌వ‌న్ పొత్తు పెట్టుకున్నార‌న్న వాద‌న‌లు వినిపించాయి. ఈ వాద‌న‌లు నిజ‌మేన‌న్న‌ట్లుగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో టీడీపీని ప‌ల్తెత్తు మాట అన‌ని ప‌వ‌న్‌.. వైసీపీని టార్గెట్ చేస్తూ ముందుకు సాగారు. ఈ త‌ర‌హా ప‌వ‌న్ వైఖ‌రి రాఘ‌వ‌య్య‌కు న‌చ్చ‌లేద‌ట‌. ఈ కార‌ణంగానే ఆయ‌న త‌న ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన‌ట్టుగా తెలుస్తోంది.

ఇక మ‌రో కారణం కూడా వినిపిస్తోంది. పార్టీ పెట్టిన నాటి నుంచి ప‌వ‌న్ తో కొన‌సాగుతూ వ‌స్తున్న త‌న లాంటి సీనియ‌ర్ల‌ను కాకుండా నిన్న‌గాక మొన్న పార్టీలో చేరిన వారికే ప‌వ‌న్ ప్రాధాన్యం ఇస్తున్నార‌ట‌. ఈ వైఖ‌రి కూడా మారిశెట్టిని బాగానే బాధ పెట్టేసిందట‌. ఓ వైపు టీడీపీతో లోపాయికారి ఒప్పందం, మ‌రోవైపు పాత కాపుల‌ను ప‌క్క‌న‌పెడుతున్న నేప‌థ్యం...  వెర‌సి మారిశెట్టి రాఘ‌వ‌య్య రాజీనామాకు దారి తీశాయ‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. మారిశెట్టితో పాటు పార్టీలో క్రియాశీల‌కంగా ఉన్న అర్జున్ అనే నేత కూడా జ‌న‌సేన‌కు రాజీనామా చేశార‌ట‌. ఇటీవ‌లే ప‌వ‌న్ వైఖ‌రి న‌చ్చ‌ని కార‌ణంగా పార్టీ కీల‌క నేత అద్దెప‌ల్లి శ్రీ‌ధ‌ర్ పార్టీకి దూరంగా జ‌రిగారు. ఈ షాక్ నుంచి తేరుకునేలోగానే ఇప్పుడు మారిశెట్టి కూడా పార్టీకి రాజీనామా చేయ‌డం... ప‌వ‌న్ కు భారీ దెబ్బేన‌న్న వాద‌న వినిపిస్తోంది.

Tags:    

Similar News