మన్ కీ బాత్ లో చెప్పటం కాదు.. భారతరత్న ఇచ్చి చేతల్లో చూపించొచ్చుగా మోడీ?

Update: 2023-05-30 10:02 GMT
తియ్యటి మాటలు మోడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాటలకు.. చేతలకు ఏ మాత్రం పొంతన లేకుండా వ్యవహరించే ఆయన.. తాజాగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి మాట్లాడిన మాటలు విన్నప్పుడు ఔరా అనుకోకుండా ఉండలేం. ఎందుకంటే.. దేశంలో భారతరత్న విశిష్ఠ పురస్కారానికి నూటికి నూరుశాతం అర్హత ఉన్న ఎన్టీవోడికి కాంగ్రెస్ హయాంలో ఆ పురస్కారం దక్కలేదు. ప్రధానిగా బాధ్యత చేపట్టిన మోడీ గడిచిన తొమ్మిదేళ్లలో ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ మీద స్పందించింది లేదు. ఆయన అనుకోవాలే కానీ..దానికి అడ్డు చెప్పేటోళ్లు ఉండరు.

తెలుగు ప్రజల ఉనికి ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్టీఆర్  కు భారతరత్నను ప్రకటించటానికి ఉన్న అడ్డంకి ఏమిటో ఎవరూ చెప్పరు. అదే సమయంలో ఆయనకు ఆ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించరు. ఎన్టీఆర్ కు అత్యున్నత పురస్కారాలు.. సత్కారాలు లబించకపోవటానికి కారణం రాజకీయ కోణమే తప్పించి మరింకేమీ లేదని చెప్పాలి. దేశాన్ని దశాబ్దాల తరబడి ఏలిన కాంగ్రెస్ కు ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారాన్ని ఇవ్వాలన్న ఆలోచన లేకపోవటంలో అర్థం ఉంది. ఆ పార్టీకి ఎదురు నిలిచిన ఎన్టీఆర్ కు భారతరత్న లాంటి పురస్కారాన్ని ప్రకటించాలన్న ఆలోచనను కిలోమీటర్ల ముందే ఆపేస్తుంది.

మరి.. మోడీకి ఏమైంది? అన్న ప్రశ్నకు సమాధానం లభించదు. ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకొని.. పెద్ద ఎత్తున ఉత్సవాల్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్ని తన మన్ కీ బాత్ ప్రోగ్రాంలో ప్రస్తావించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఎన్టీఆర్ గురించి.. ఆయన గొప్పతనం గురించి వివరించిన మోడీ మాటల్ని చూసినప్పుడు.. ఇన్ని తెలిసిన పెద్ద మనిషికి ఎన్టీఆర్ కు భారతరత్నను ఎందుకు ప్రకటించలేదు? అన్న సందేహం కలుగక మానదు.

మోడీ మాటల్ని చూస్తే.. 'నా ప్రియమైన దేశ ప్రజలారా.. రాజకీయాల్లో.. సినిమా పరిశ్రమలో తన అద్భుతమైన ప్రతిభతో చెరగని ముద్ర వేసిన గొప్ప వ్యక్తి గురించి ఇప్పుడు నేను మీతో చర్చించబోతున్నాను. ఆయన మనందరికీ ఎన్టీఆర్ అనే పేరుతో కూడా తెలుసు. ఆయన తన ప్రతిభతో తెలుగు చిత్రసీమలో సూపర్ స్టార్ గా నిలవటమే కాదు.. కోట్లాది ప్రజల మనసుల్ని కూడా గెలుచుకున్నారు.

ఆయన 300లకు పైగా సినిమాల్లో నటించిన సంగతి మీకు తెలుసా? ఆయన తన నటనతో అనేక చారిత్రక పాత్రలకు ప్రాణం పోశారు. భగవాన్ శ్రీక్రిష్ణుడు.. శ్రీరాముడు వంటి అనేక పాత్రల్లో ఎన్టీఆర్ నటనను ప్రజలు ఎంతగానో ఇష్టపడ్డారు. ప్రజలు ఇప్పటికీ ఆయన్నను గుర్తుంచుకుంటారు. ఎన్టీఆర్ సినీ రంగంతో పాటు రాజకీయాల్లోనూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.
4

ఇక్కడ కూడా ఆయన ప్రజల నుంచి ప్రేమ.. ఆశీర్వాదం పొందారు. దేశంలోనూ.. ప్రపంచ వ్యాప్తంగానూ లక్షలాదిమంది మనసుల్ని ఏలిన రామారావుకు నా వినమ్రపూర్వక నివాళులు అర్పిస్తున్నాను' అని కీర్తించారు ప్రధాని మోడీ.

ఇన్ని మాటల్ని మన్ కీ బాత్ లో చెప్పిన మోడీ.. ఎన్టీఆర్ అభిమానుల చిరకాల వాంఛ అయిన భారతరత్న పురస్కారాన్ని ఎందుకు ప్రకటించరు. మన్ కీ బాత్ మాటలే నిజమైనప్పుడు ఆయనకు ఆ అత్యుత్తమ పౌర పురస్కారాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది. కనీసం.. వచ్చే జనవరిలో అయినా కోట్లాది మంది తెలుగు ప్రజల కోరికను తీరుస్తారని ఆశిద్దాం. లేకుంటే మాత్రం.. మన్ కీ బాత్ కేవలం మాటలు చెప్పటానికే తప్పించి మరి దేనికీ పనికి రాదన్న విషయం ఫ్రూవ్ అయినట్లే.

Similar News