‘పెళ్లి’పై మలాలా సంచలన వ్యాఖ్యలు.. నెటిజన్ల ఫైర్.. అసలేమైంది?

Update: 2021-06-05 04:30 GMT
ఉగ్రవాదుల తూటాలకు చిక్కినప్పటికి అనూహ్యంగా ప్రాణాలతో బయపడి.. ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారారు మలాలా యూసఫ్ జాయ్. పిన్న వయస్సులోనే నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న ఆమె.. ప్రముఖ బ్రిటీష్ మ్యాగ్ జైన్ ‘వోగ్’ జులై ఎడిషన్ కవర్ మీద కనిపించారు. ఇప్పటివరకు చూసిన మలాలాకు కాస్త భిన్నంగా ఈ కవర్ ఫోటో ఉందని చెప్పాలి.

రాజకీయాలు.. కల్చర్ తో పాటు పర్సనల్ లైఫ్ నకు సంబంధించిన పలు అంశాల్ని ఆమె పంచుకుంది. ఈ క్రమంలో పెళ్లి పైన ఆమె నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను సంచలనంగా మారాయి. పాక్ నెటిజన్లు ఆమెను తిట్టిపోస్తున్నారు. ఇంతకీ అంతటి పెద్ద తప్పు ఏం చేశారంటే.. పెళ్లిపై ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలే అన్న మాట చెప్పాలి. తన తల్లిదండ్రులు తనను పెళ్లి కుమార్తెగా చూడాలని ఆశ పడుతున్నట్లు ఆమె చెప్పారు.

పెళ్లిపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. ‘‘చాలామంది తమ సంబంధాల కథనాల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. వాటిని చూస్తే నాకు చాలా ఆందోళన కలుగుతుంది. అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలో అర్థం కావటం లేదు. కేవలం భాగస్వాములుగా ఎందుకు ఉండలేరు’’ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై పాకిస్థానీయులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆమెపై గతంలో ఎప్పుడూ లేనంత ఆగ్రహావేశాల్ని నెటిజన్ల రియాక్షన్ లో కనిపిస్తోంది.

ఇస్లాం సంస్కృతిని భ్రష్టుపట్టిస్తున్నావ్‌.. నీ వ్యాఖ్యలు విచారకరం.. నువ్వు ఇంతటి బాధ్యతారాహిత్యంగా ఎలా మాట్లాడతావ్? నీ మాటలతో యువతను పెడ దోవన పెడుతున్నావ్? నువ్వు విదేశీ వ్యక్తివి అయ్యావ్.. ఇలా మలాలా పెళ్లి వ్యాఖ్యలపై నెటిజన్లు నెగెటివ్ గా రియాక్టు అవుతున్నారు. ఇంతటి ఆగ్రహావేశాల వేళ.. ఆమె ఇదే విషయంపై మరోసారి వివరణ ఇస్తారా? లేదా? చూడాలి.
Tags:    

Similar News