బంద్ సక్సెస్ కాకుంటే గడీల రాజ్యమేనంట

Update: 2015-10-09 12:05 GMT
రైతులకు రుణమాఫీని ఏకమొత్తంలో పరిహరించాలని కోరుతూ.. తెలంగాణలోని విపక్షాలు పిలుపునిచ్చిన బంద్ విజయవంతం అయ్యేందుకు పార్టీల వారీగా రంగంలోకి దిగుతున్నారు. ఎవరికి వారుగా.. తెలంగాణ బంద్ విజయవంతం కోసం ప్రయత్నిస్తున్నారు.

విపక్ష పార్టీలన్నీ కలిసి బంద్ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో బంద్ ను విజయవంతం చేయటానికి ఏమేం చేయాలో అన్నీ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. పనిలో పనిగా.. పలువురు నేతలు బంద్ విజయవంతం చేయాలని కోరుతున్నారు. అయితే.. ఈ సందర్భంగా చేస్తున్న వ్యాఖ్యలు కొన్ని ఆసక్తికరంగా మారుతున్నాయి. రేపటి బంద్ కానీ విజయవంతం కానిపక్షంలో గడీల రాజ్యం తప్పదని హెచ్చరిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేత మధుయాష్కీ.

2019లో తమ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని చెబుతున్న మధుయాష్కీ.. తాము అధికారంలోకి వచ్చాక ఇప్పటి తెలంగాణ మంత్రుల బండారాన్ని బయటపెడతామని.. ప్రస్తుతం మంత్రులుగా అధికారాన్ని వెలగబెడుతున్న వారందరిని జైలు తప్పదని హెచ్చరిస్తున్నారు. రైతుల రుణాల్ని ఒకేసారి మాఫీ చేయమని అడిగిన దానికి అసెంబ్లీ నుంచి విపక్ష నేతల్ని సస్పెండ్ చేశారని.. ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందని మండిపడ్డారు. రైతులంటే చులకన ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు బుద్ది చెప్పేలా బంద్ ను విజయవంతం చేయాలని మధుయాష్కీ కోరుతున్నారు. బంద్ లకు పిలుపునివ్వటం ఓకే కానీ.. సక్సెస్ కాకుండా గడీల రాజ్యమేనంటూ ఈ బెదిరింపులేంది..?
Tags:    

Similar News