వామన్ రావు హత్యలో పుట్ట మధు హస్తం ..'సిబిఐ' విచారణకి పిటిషన్

Update: 2021-02-18 11:30 GMT
హైకోర్టు న్యాయవాది వామన్‌రావు, ఆయన భార్య నాగమణిని దుండగులు ఫిబ్రవరి 17న అతి కిరాతకంగా నరికి చంపిన సంగతి తెలిసిందే. వామన్ ‌రావు దంపతులు మంథని నుంచి హైదరాబాద్‌ కు కారులో వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రామగిరి మండలం సమీపంలో వీరి కారును మరో కారులో వచ్చిన గుర్తు తెలియని దుండగులు అడ్డగించారు. అనంతరం వారిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో దంపతులిద్దరు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆ తర్వాత వారిని స్థానికులు పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. మరోవైపు న్యాయవాది హత్య వెనుక ప్రభుత్వ పెద్దల హస్తముందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. వారిని కాపాడేందుకు అవసరమైతే నిందితులను ఎన్‌కౌంటర్ చేస్తారని బాంబు పేల్చారు.

ఈ జంట హత్యల కేసులో పెద్దపల్లి జడ్పీ చైర్మన్, టీఆర్ ఎస్ పార్టీ నేత పుట్ట మధు పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కుంట శ్రీనివాస్ పుట్ట మధుకు ప్రధాన అనుచరుడు కావడంతో ఈ హత్య కేసులో పుట్టమధు ప్రమేయం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ హత్యలో ప్రధాన పాత్రధారుడు కుంట శ్రీనివాస్ మంథని మండల టిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉన్నాడు. అంతేకాకుండా ఆయన పుట్ట మధు ప్రధాన అనుచరుడు. మంథని అంబేద్కర్ సర్కిల్లో సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసిన కార్యక్రమంలో కూడా పాల్గొన్న కుంట శ్రీనివాస్ ఆ తర్వాత ఊహించని విధంగా వామన్ రావు దంపతులను చంపేశాడు.

ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన అనేక అక్రమాలు వామన్ రావు దంపతులకు తెలియడం వల్లే వారిని అత్యంత దారుణంగా హతమార్చారని ప్రతిపక్షాల నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే టీఆర్ ఎస్ పార్టీకి దంపతుల హత్య కు ఎలాంటి సంబంధం లేదని టిఆర్ ఎస్ పార్టీ నేతలు చెబుతున్నారు . కుంట శీను గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎంపీటీసీ గా కూడా పని చేశారని, కావాలని కాంగ్రెస్ నేతలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. కానీ లాయర్ దంపతుల హత్య వెనుక రాజకీయ కుట్ర ఉందని పలువురు ఆరోపిస్తున్నారు .ఈ నేపథ్యంలోనే వామన్ రావు దంపతుల హత్య పై సుప్రీం కోర్టు న్యాయవాది శ్రవంత్ శంకర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును సిబిఐతో విచారణ జరిపించాలని వారు పిటిషన్లో పొందుపరిచారు.
Tags:    

Similar News