కర్కోటకుడు-హిట్లర్: రేవంత్ రెడ్డిపై కవిత ఫైర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.;
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కర్కోటకుడు, హిట్లర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కర్కోటకుడి పాలన సాగుతోందని దయ్యబట్టారు. హిట్లర్ తరహాలో సాగుతున్న పాలనకు వ్యతిరేకంగా టీఆర్ ఎస్ పోరాడుతుందన్నారు. అన్ని వర్గాలను వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఏ ఒక్క హామీని అమలు చేయలేదని.. విమర్శించారు.
బానిస ఎంపీలు..
బీజేపీ ఎంపీలను బానిసలు అంటూ కవిత ఫైరయ్యారు. తెలంగాణ ప్రయోజనాలకు గండికొడుతున్నా.. బానిస ఎంపీలు పార్లమెంటులో పలకడం లేదన్నారు. బీజేపీ బానిస ఎంపీలు తెలంగాణ బిడ్డలైతే.. భద్రాచలం గ్రామాలను వెనక్కి తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. ఐదు గ్రామాలను వెనక్కి తీసుకురావాలని సవాల్ రువ్వారు. తాము జాగృతి తరఫున ఏపీకి, కేంద్రానికి లేఖ రాశామన్నారు. పోలవరం కడితేభద్రాచలం రామాలయం మునిగిపోతుందని.. మీకు బాధ్యత లేదా? అని ప్రశ్నించారు.
ఉద్యమ రథం గాడి తప్పింది..
బీఆర్ ఎస్ పార్టీపైనా తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమ రథం బాగానే సాగినా.. పాలనా రథం గాడి తప్పిందని దుయ్యబట్టారు. 1.89 లక్షల కోట్లరూపాయలు ఖర్చు చేసి ప్రాజెక్టులు కేవలం లక్ష ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారని.. ఇది అత్యంత బాధాకరమని అన్నారు. హైడ్రాతో ఇళ్లు కూల్చినా.. ఖమ్మంలోని వెలుగుమట్లలో ఇళ్లు కూల్చితే కూడా.. కేసీఆర్ బయటకు రాలేదని విమర్శించారు. ``ఆ సారు రారు.. ఆయన మారిన మనిషి. మర మనిషి. గుంటనక్కల చేతుల్లో చిక్కిన మనిషి. చాలా బాధతో చెబుతున్నా`` అని వ్యాఖ్యానించారు.
పదేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు ముందుకు సాగలేదని ప్రశ్నించారు. ``మన కేసీఆర్ అయ్యి ఉంటే.. పాలమూరు-రంగారెడ్డి దగ్గర గుడిసె వేసుకుని అయినా.. నిర్మాణం చేసుకునేవారు`` అని అన్నారు. కానీ, ఆయన తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదన్నారు. పంజాబ్ పోయి.. పార్టీలను ఏకం చేసే ప్రయత్నం చేశారని.. విమర్శించారు. ``మన కేసీఆర్ అయి ఉంటే.. బయటకు వచ్చేవారు. కానీ, రావడం లేదు. అదికారం ముందు మమకారం తగ్గిపోయిందా? ఏమైంది?`` అని ప్రశ్నించారు.
నాకు తండ్రే.. కానీ!
``నాకు తండ్రే కావొచ్చు. కానీ, అది వేరే విషయం. కానీ, ఆయన పరిణితి కోల్పోయారు. ప్రజలు తప్పు చేశారని అన్నారు. నేను ఒక తల్లిగా చెబుతున్నా.. నా బిడ్డ నామాట వినలేదు. అయితే.. నా బిడ్డ కింద పడితే చూడనా.. పట్టించుకోనా..? అది తల్లి ప్రేమ. ఆ కేసీఆర్ ఏమయ్యారు. నన్ను పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా పార్టీ పెట్టాలని అనుకోలేదు. చాలా అవకాశం ఇచ్చాను మారుతారేమోనని ఎదురు చూశా. కానీ.. 10 నెలలు అయింది. అందుకే పార్టీ పెట్టా. కేసీఆర్ కోసం.. టీఆర్ ఎస్ కోసం.. ఇళ్లు అమ్ముకుని, భూములు అమ్ముకుని పోరాటం చేసిన కార్యకర్తలు ఎక్కడున్నారు. చిన్న పదవులు కూడా ఇవ్వలేరా?`` అని నిలదీశారు.