'మోడీ-ఈడీ'.. ఠారెత్తతున్న నినాదం!
కానీ.. కేజ్రీవాల్ మాత్రం అప్రమత్తంగానే ఉన్నారు. అయితే.. నిన్న మొన్నటివరకు బీజేపీ ఈ విషయంపై మౌనంగానే ఉంది.;
జాతీయస్థాయిలో ఓ నినాదం దుమ్మురేపుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యుల ను బీజేపీ చేర్చుకునేందుకు రెడీ అయిన నేపథ్యంలో `మోడీ.. కాదంటే ఈడీ` నినాదం ఇప్పుడు ఢిల్లీ వీధుల్లో కనిపిస్తోంది. ఎవరు అంటించారో.. ఎప్పుడు అంటించారో తెలియదు కానీ.. రాత్రికి రాత్రి ఢిల్లీలోని దుకాణాలు.. వీధుల్లో పెద్ద ఎత్తున పోస్టర్లు కనిపించాయి. దీంతో ఢిల్లీ మునిసిపల్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన వీటిని తొలగించే పనిని చేపట్టారు.
వాస్తవానికి ఆప్‌లో ఉన్న వారంతా ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ కు అత్యంత విధేయులనే పేరుంది. అయితే.. ఆప్‌ను అంతం చేస్తామని.. గత ఏడాది కేంద్ర మంత్రి అమిత్ షా.. ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో ప్రకటించారు. దీనికి ముందు ఢిల్లీ ఎన్నికల సమయంలోనూ ఆయన ఇదే విధంగా ప్రచారం చేశారు. ``ఈ ఎన్నికలే ఆప్‌కు చివరి ఎన్నికలు. మీరు చూస్తారు. ఇక ఆపార్టీ ఉండదు. రాసి పెట్టుకోండి`` అని ఉద్ఘాటిం చారు. అయితే.. దీనిని కొందరు లైట్ తీసుకున్నారు.
కానీ.. కేజ్రీవాల్ మాత్రం అప్రమత్తంగానే ఉన్నారు. అయితే.. నిన్న మొన్నటివరకు బీజేపీ ఈ విషయంపై మౌనంగానే ఉంది. కానీ, ఈలోగా.. ఢిల్లీ కోర్టు మద్యం కేసులో కేజ్రీవాల్ సహా.. ఆప్ నేతలకు.. ఈ కేసులో ఉన్న కవిత సహా ఇతరులకు క్లీన్ చిట్ ఇచ్చేసింది. దీంతో బీజేపీ ఇరుకున పడింది. పైగా కేజ్రీవాల్.. మద్యం కేసు విషయాన్ని మరింత దూకుడుగా ప్రజల మధ్యకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో బీజేపీ ఆత్మరక్షణలో పడింది. తాము ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసు వీగిపోతున్న నేపథ్యంలో రాజకీయంగాపావులు కదిపింది.
ఈ క్రమంలోనే రాఘవ్ చద్దాను అడ్డు పెట్టుకుని.. పాచిక పారించేలా చేసిందన్న విమర్శలు బీజేపీ చుట్టూ ముసిరాయి. ఇటీవల ఆప్.. నేత.. అశోక్ మిట్టల్ ప్రైవేటు విశ్వవిద్యాలయంపై ఈడీ అధికారులు దాడులు చేశారు. ఈ జాబితాలో ఇతర నాయకులు కూడా ఉన్నారన్న చర్చ జరిగింది. ఇది జరిగి.. నాలుగు రోజులు కూడా గడవకుండానే.. వారంతా బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు రాఘవ చద్దా వెంట పయనించడంతో ఇప్పుడు `మోడీ.. కాదంటే ఈడీ`నినాదాన్ని ఆప్ పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకువచ్చింది.