లవ్ మ్యారేజీకి జగన్ పార్టీ ఎమ్మెల్యే హామీ..!

Update: 2019-08-27 05:08 GMT
చిత్తూరు నగర ప్రజలకు రియల్ సినిమా చూపించాడో ఆటో డ్రైవర్. అతగాడి దెబ్బకు స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సైతం సీన్లోకి రావాల్సి వచ్చింది. నాటకీయ పరిణామాల నేపథ్యంలో రెండున్నర గంటల పాటు సాగిన హైడ్రామా హాట్ టాపిక్ గానే కాదు.. జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. చిత్తూరు నగరంలోని వళ్లియప్పనగర్ కుచెందిన సంపత్ కుమార్ ఒక ఆటో డ్రైవర్.

తవణం పల్లె మండలానికి చెందిన ఒక అమ్మాయితో అతనికి ఏడేళ్ల ప్రేమ బంధం ఉంది. ఇద్దరి కులాలు వేర్వేరు కావటంతో.. అమ్మాయివారి ఇంట్లో పెళ్లికి నో చెప్పేశారు. దీంతో.. ఎంత ప్రయత్నించినా ఒప్పుకోలేదు. దీంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన సంపత్.. సోమవారం సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో చిత్తూరు పట్టణంలో ఫుల్ బిజీగా ఉండే ఓటేకే రోడ్డులోని గురునాథ థియేటర్ సమీపంలోని సెల్ టవర్ ఎక్కి సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేశారు. దీంతో.. స్థానిక పోలీసులు అతన్ని రక్షించే ప్రయత్నం చేశారు.

ఫైర్ శాఖకు చెందిన అధికారులతో పాటు.. పోలీసులు ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. చివరకు యువకుడి తల్లి అక్కడకు చేరుకొని బ్రతిమిలాడినా వినలేదు. దీంతో.. ఆమె సొమ్మసిల్లి పడిపోయారు. తమ ప్రేమపెళ్లికి స్పష్టమైన హామీ ఇచ్చే వరకూ దిగనని మొండికేశాడు. ఈ సమయంలో.. తన పెళ్లికి స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు హామీ ఇస్తే దిగుతానని మాటిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జగన్ పార్టీ ఎమ్మెల్యే రంగంలోకి దిగారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఆయన.. అమ్మాయి బంధువులతో తాను మాట్లాడి పెళ్లికి ఒప్పిస్తానని హామీ ఇచ్చారు. దీంతో.. సదరు యువకుడు సెల్ టవర్ దిగాడు. రెండున్నర గంటల పాటుసాగిన ఈ హైడ్రామా ప్రశాంతంగా ముగియటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ రచ్చకు కారణమైన యువకుడి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసుది ఏముంది?  కోరుకున్న అమ్మాయితో పెళ్లి జరిగితే చాలన్నట్లుగా సదరు యువకుడి తీరు ఉండటం గమనార్హం.
Tags:    

Similar News