సందేశం సరే.. టాస్కులు ఇవ్వకుండా నిరాశను కలిగించారా?

Update: 2020-04-16 03:00 GMT
దేశానికి ఇప్పటివరకూ పలువురు ప్రధానమంత్రులు తమ పదవిని చేపట్టి ఉండొచ్చు కానీ.. ఒక ప్రధాని హయాంలో కలలో కూడా ఊహించని పరిణామాలు చోటు చేసుకున్న క్రెడిట్ మాత్రం మోడీకే చెల్లుతుంది. పెద్ద నోట్ల రద్దు కానీ.. సర్జికల్ స్ట్రైక్స్ కానీ.. కరోనా మహమ్మారి.. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కానీ.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నో అంశాలు మోడీ ప్రధానిగా ఉన్నప్పుడే చోటు చేసుకున్నాయి. ఈ దేశ ప్రధాని ఎవరన్న మాటను గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు అడిగితే ఇందిరమ్మ అనే మాట వినిపించేది.

అప్పటికి ఆమె మరణించి కొన్నేళ్లు అయినా.. ఆమే ప్రధాని అన్న ఫీలింగ్ లో దేశంలోని కొన్ని ప్రాంతాల వారు ఉండేవారు. ఇక్కడ చెప్పేదేమంటే.. సామాన్యుల మీద ఇందిరమ్మ చూపించిన ప్రభావం ఎంతన్నది చెప్పటమే. అలా అని మిగిలిన ప్రధానుల్ని చిన్నబుచ్చాలన్న ఉద్దేశం ఏమాత్రం లేదు. తన మాటతో దేశ ప్రజల్ని ఒక తాటి మీదకు తీసుకురావటం.. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా స్పందించటం లాంటివి మోడీకే చెల్లింది.

ఆయన ఇంట్లో నుంచి బయటకు రావొద్దన్నా.. సాయంత్రం ఐదు గంటల వేళకు గంటలు కొట్టాలన్నా.. దీపాలు వెలిగించాలన్న యావత్ దేశం.. దాన్ని చేసి చూపింది. కరోనా వేళ.. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత.. తరచూ ఏదో ఒక టాస్కును మోడీ ఇవ్వటం.. దాన్ని దేశ ప్రజలంతా పక్కాగా పాటించటం లాంటివి చూసిందే. మంగళవారం దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారన్నప్పుడు.. చాలామంది ప్రధాని సందేశం ఏమై ఉంటుందన్న దాని కంటే ఆయన ఎలాంటి టాస్కు ఇస్తారో అని కూతుహలంగా చూసినోళ్లు ఉన్నారు.

అలాంటి వారి ఆశల మీద నీళ్లు చల్లేలా ఆయన కేవలం సందేశంతో ముగించారు. ఎలాంటి టాస్కు ఇవ్వలేదు. ప్రధాని స్థాయి లాంటి వ్యక్తి ఇచ్చిన పిలుపును టాస్కు పేరుతో చిన్నబుచ్చుతారా? అని కొందరు ఆగ్రహం వ్యక్తం చేయొచ్చు. కానీ.. దేశ ప్రధాని నుంచి సందేశమే కాదు.. ఆయన చెప్పినవన్నీ సీరియస్ గా చేస్తామన్న అభిలాషను దేశ ప్రజలు వ్యక్తం చేస్తున్న వైనాన్ని మర్చిపోకూడదు.
Tags:    

Similar News