టీడీపీ @ 44 : కార్యకర్తలే ప్రాణంగా నాలుగున్నర దశాబ్దాల ప్రస్థానం

తెలుగుదేశం పార్టీ ఓ అరుదైన చరిత్ర దిశగా పయనిస్తోంది. నాలుగున్నర దశాబ్దాలుగా నిరంతర ప్రయాణం సాగిస్తున్న టీడీపీ ఆదివారం మరో మైలురాయిని దాటింది.;

Update: 2026-03-29 18:26 GMT

తెలుగుదేశం పార్టీ ఓ అరుదైన చరిత్ర దిశగా పయనిస్తోంది. నాలుగున్నర దశాబ్దాలుగా నిరంతర ప్రయాణం సాగిస్తున్న టీడీపీ ఆదివారం మరో మైలురాయిని దాటింది. ఈ రోజున టీడీపీ 44వ వార్షికోత్సవం జరుపుకుంది. తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ నాలుగు దశాబ్దాలకు పైగా చెక్కుచెదరకుండా నిలబడటం అంటే సామాన్యమైన విషయం కాదు. లెజెండరీ నటుడు నందమూరి తారక రామారావు విప్లవాత్మక ఆలోచన నుంచి పుట్టిన తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థ నాయకత్వంతో పడిలేచిన కెరటంలా దూసుకుపోతోంది. ఈ ప్రయాణంలో టీడీపీ మూడో తరం నేతల చేతుల్లోకి వెళ్లే దశ కోసం ఎదురుచూస్తోంది. నేడో రేపో యువనేత లోకేశ్ కు టీడీపీ పగ్గాలు బదిలీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో టీడీపీ ప్రస్థానంపై హాట్ డిబేట్ జరుగుతోంది.

సంక్షోభం నుంచి సంపూర్ణ విజయం

టీడీపీ చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన సమయం 2019 నుంచి 2024 మధ్య కాలం అని చెబుతారు. 1982లో టీడీపీ ఆవిర్భవించగా, కేవలం 9 నెలల్లోనే అధికారం సాధించి ఓ రికార్డు సాధించింది. అయితే టీడీపీ ప్రస్థానంలో జయాపజయాలు కొత్త కానప్పటికీ 2019లో ఎదురైన ఘోర ఓటమి టీడీపీ భవిష్యత్తుపై ఎన్నో ప్రశ్నలు లేవనెత్తింది. అయితే కేవలం ఐదేళ్లలో తిరిగి పుంజుకున్న టీడీపీ రాష్ట్ర చరిత్ర మరెవరికీ దక్కని విజయాన్ని అందుకుంది. 2024 ఎన్నికల్లో అసెంబ్లీలో 90 శాతం సీట్లను టీడీపీ దక్కించుకోవడం ఓ రికార్డుగా చెబుతారు.

2019 ఎన్నికల్లో కేవలం 23 సీట్లకు పరిమితమైనప్పుడు, పార్టీ భవిష్యత్తుపై చాలామందికి అనుమానాలు కలిగాయి. కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు అచంచలమైన ఆత్మవిశ్వాసంతో పార్టీని ముందుకు నడిపారు. కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపుతూ, వ్యూహాత్మకంగా ఎన్డీయే కూటమిని ఏర్పాటు చేయడంలో ఆయన విజయం సాధించారు. ఇందులో ఉప ముఖ్యమంత్రి పవన్, మంత్రి లోకేశ్ పాత్ర కీలకమే. అన్నింటికి మించి టీడీపీ కార్యకర్తలు ఆ ఐదేళ్లు పార్టీని రక్షించుకున్న తీరు ఆకట్టుకుంటోంది. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి ఇలాంటి కార్యకర్తల బలగం లేదని చెబుతారు. ఎందుకంటే కార్యకర్తలు అంతగా తమ పార్టీని శ్వాసిస్తారని అనేక ఘటనలు రుజువు చేశాయి.

టీడీపీ మనుగడకు ప్రధాన కారణాలు

కార్యకర్తలే వెన్నెముక అన్న సిద్ధాంతంతో పనిచేయడమే టీడీపీ విజయ ప్రస్థానానికి మూల కారణంగా వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా, పసుపు జెండాను మోస్తూ, క్షేత్రస్థాయిలో పోరాడే బలమైన కేడర్ ఉండటమే టీడీపీ అసలు బలం. నాయకత్వంపై నమ్మకంతో నిలబడే ఈ సైన్యమే పార్టీ రాజకీయ మనుగడకు ప్రధాన ఆధారంగా చెబుతారు. ఇక ఇదే సమయంలో పరిపాలన, అభివృద్ధి పైనే టీడీపీ అధినాయకత్వం దృష్టి పెట్టడం ఆ పార్టీ విజయానికి ప్రధాన కారణం అవుతోందని అంటున్నారు. ఇప్పుడు అమరావతి రాజధాని ప్రాజెక్టు పూర్తి చేయడం, పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ప్రజలకు మెరుగైన భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది టీడీపీ.

సమన్వయంతో నాయకత్వం

ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ కేంద్రంలోని బీజేపీ నాయకత్వంతో ఉన్న సానుకూల సంబంధాలు కూటమిని బలంగా ఉంచుతున్నాయని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీలో నాయకత్వ మార్పు కూడా చాలా సాఫీగా జరుగుతోందని సంకేతాలు అందుతున్నాయి. యువనేత నారా లోకేష్ యువ నాయకుడిగా క్యాడర్ నమ్మకాన్ని గెలుచుకున్నారు. గూగుల్, ఇన్ఫోసిస్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో చర్చలు జరిపి రాష్ట్రానికి పెట్టుబడులు తేవడంలో ఆయన చూపుతున్న చొరవ పార్టీకి కొత్త ఊపిరినిస్తోంది.

తెలంగాణలో కూడా టీడీపీకి ఇప్పటికీ బలమైన మూలాలు ఉండటం ఆ పార్టీ పునాదుల బలానికి నిదర్శనం. 44 ఏళ్ల ఈ ప్రస్థానంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్న టీడీపీ, ఇప్పుడు కేవలం అధికారం కోసమే కాకుండా, రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే దిశగా అడుగులు వేస్తోందని అభినందనలు అందుకుంటోంది. పాలనలో ఇదే వేగాన్ని, కూటమిలో ఇదే సమన్వయాన్ని కొనసాగిస్తే తెలుగుదేశం పార్టీకి తిరుగుండదని ఈ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News