అమరావతి తీర్మానం భేష్: వెంకయ్య
ఏపీ రాజధాని అమరావతిని శాశ్వత రాజధానిగా.. ఏపీకి ఏకైక రాజధానిగా మార్చేలా అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు.;
ఏపీ రాజధాని అమరావతిని శాశ్వత రాజధానిగా.. ఏపీకి ఏకైక రాజధానిగా మార్చేలా అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాతో మాట్లాడినట్టు తెలిసింది. ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టి ఆమోదించాలని ఆయన అమిత్‌షాను కోరారు.
దీనిపై వెంకయ్య స్పందిస్తూ.. 2015, అక్టోబర్ 22న ప్రధాని నరేంద్ర మోదీ, అప్పటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న తన చేతులమీదుగా రాజధానికి శంకుస్థాపన జరిగిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించిన సాయం గురించి ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. 2019 తర్వాత జరిగిన పరిణామాలు, ఎదురైన ఇబ్బందులను హోం మంత్రికి వివరించారు.
ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగిన నష్టాన్ని కేంద్రానికి వివరించిన వెంకయ్యనాయుడు.. భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంటులో బిల్లు పెట్టి ఆమోదిం చాలని కోరినట్టు తెలిసింది. అంతేకాదు. సాధ్యమైనంత వేగంగా కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని విన్నవించారు. ఈ విషయంపై అమిత్ షా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై తన మంత్రిత్వ శాఖ నుంచి అన్నీ క్లియర్ అయ్యాయని తెలిపినట్టు సమాచారం.
చాలా మంచి నిర్ణయం..
ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానంపై వెంకయ్య సానుకూలంగా స్పందిస్తూ.. ఇది మంచి నిర్ణయమన్నారు. హైదరాబాద్‌లో ఆదివారం ఆయన ఆఫ్ దిరికార్డుగా మాట్లాడుతూ.. ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని మాత్రమే ఉంటుందని.. ఏపీకి అమరావతి సరైన రాజధాని ప్రాంతమని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో రాష్ట్రానికి ఈ నగరం అత్యంత మేలు చేస్తుందని తెలిపారు.