తెలంగాణ కాంగ్రెస్ హ‌ల్‌చ‌ల్‌.. చ‌లో రాజ్‌భ‌వ‌న్ కు క‌ద‌లి వ‌చ్చిన నేత‌లు

Update: 2021-01-19 10:53 GMT
తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు అనూహ్య పిలుపునిచ్చారు. కేంద్ర‌ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్న నేత‌లు.. తాజాగా ప్ర‌భుత్వంపై పోరులో భాగంగా చ‌లో రాజ్‌భ‌వ‌న్‌కు కాంగ్రెస్ నేత‌లు పిలుపునిచ్చారు. సాగు చ‌ట్టాల ర‌ద్దుతోపాటు పెట్రో ధ‌ర‌ల పెంపును నిర‌శిస్తూ.. కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు చ‌లో రాజ్‌భ‌వ‌న్‌కు పిలుపుని చ్చా రు. దీనికి భారీ ఎత్తున నాయ‌కులు త‌ర‌లి రావ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికి వారుగా.. ఉన్న నాయ‌కులు తాజాగా చ‌లో రాజ్‌భ‌వ‌న్‌కు ఇచ్చిన పిలుపున‌కు మాత్రం అంద‌రూ క‌దిలి వ‌చ్చారు.

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల స‌మ‌యంలో నాయ‌కులు పార్టీల్లో ఎవ‌రిదారిలోవారు న‌డిచారు. ఫ‌లితంగా ఎలాంటి రిజ‌ల్ట్ వ‌చ్చిందో తెలిసిందే. అయితే.. అనూహ్యంగా చ‌లో రాజ్‌భ‌వ‌న్ కు మాత్రం నాయ‌కులు ఐక్య‌త ప్ర‌ద‌ర్శించారు. టీపీసీసీ మాజీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస్ కృష్ణన్, మధు యాష్కీ, చిన్నా రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, పార్టీ సీనియ‌ర్లు వీహెచ్, పొన్నాల, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, యూత్ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్, ఓబీసీ సెల్ చైర్మన్ కత్తి వెంకటస్వామి, ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ నాయకులు బెల్లయ్య నాయక్‌తో పాటు వందలాది మంది కార్య‌క‌ర్తలు ఈ కార్య‌క్ర‌మానికి రావ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, ముందుగానే పోలీసులు ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించి అలెర్ట్ కావ‌డంతో కాంగ్రెస్ నేత‌ల‌ను పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ‌ అడ్డుకొన్నారు. హైద‌రాబాద్ లుంబినీ పార్క్ నుంచి రాజ్ భవన్ వరకు ర్యాలీ‌గా వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నా.... సెక్ర‌టేరియ‌ట్ వ‌ద్దే కాంగ్రెస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను నిలువ‌రించి… అదుపులో‌కి తీసుకున్నారు. అనంత‌రం వారిని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు అరెస్ట్ చేయడంతో కాంగ్రెస్ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో అజెండా ఏదైనా కాంగ్రెస్ నేత‌లు మ‌ళ్లీ ఐక్యంగా రోడ్డెక్క‌డం(ఒక‌రిద్ద‌రు మిన‌హా) రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌రి ఐక్య‌త మున్ముందు కూడా కొన‌సాగుతుందా?  లేక‌.. మ‌ధ్యంత‌రంగా ఆగిపోతుందా?  చూడాలి.
Tags:    

Similar News