బీజేపీ నుంచి లంకా దినకర్ సస్పెండ్

Update: 2020-10-20 12:10 GMT
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మరింత జోరు పెంచారు. పార్టీ నియమాలకు విరుద్ధంగా.. సొంత అజెండాతో టీవీ చర్చల్లో పాల్గొంటున్న బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ కు గట్టి షాక్ ఇచ్చారు. ఏకంగా ఆయనపై వేటు వేసి పార్టీలో తోకజాడించే వారందరికీ హెచ్చరికలు పంపారు. ఇన్నాళ్లు సస్పెన్షన్లంటే ఢిల్లీ నుంచి నరుక్కు వచ్చేవారు. కానీ సోము వీర్రాజు ఉన్న ఫళంగా కట్టుదాటే నేతలపై సస్పెన్షన్లు వేస్తుండడం బీజేపీలో హాట్ టాపిక్ గా మారింది.

బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ కు ఆ పార్టీ షాకిచ్చింది. దినకర్ పై సస్పెన్షన్ వేటు వేస్తూ ప్రకటన విడుదల చేసింది. గతంలో ఇచ్చిన షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వనందుకు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు.

జూలై 26న జరిగిన ఓ చానెల్ మీడియా చర్చలో పాల్గొన్నందుకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని.. అందుకు ఆయన సరైన వివరణ ఇవ్వని కారణంగా సస్పెండ్ చేశామని ఆ పార్టీ పేర్కొంది.

దినకర్ గతంలో టీడీపీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీలో చేరారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడే ఆయన జాతీయ స్థాయి మీడియాలోనూ తరుచూ పార్టీ తరుఫున కనిపిస్తుంటారు. ఈ క్రమంలోనే పార్టీ స్టాండ్ కు వ్యతిరేకంగా మాట్లాడి సస్పెండ్ కు గురయ్యారు.
Tags:    

Similar News