పోలింగ్ కేంద్రంలో పెళ్లికొడుకు.. ఓటేశాకే పెళ్లి పీటల మీద కూర్చున్నాడు

అందుకు భిన్నంగా కాసేపట్లో పెళ్లి పెట్టుకొని.. ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన పెళ్లి కొడుకు ఉదంతం అందరిని ఆకర్షించింది.

Update: 2024-04-27 06:26 GMT

లివింగ్ రూంలో కూర్చొని జాతీయ అంతర్జాతీయ రాజకీయాల గురించి తెగ మాట్లాడే చాలామంది.. ఆ రూం దాటి ఓటేసేందుకు మాత్రం పోలింగ్ కేంద్రాలకు వెళ్లటానికి తెగ ఇబ్బందికి గురవుతుంటారు. అదేమంటే.. మన ఓటుతోనే అంతా మారిపోతుందా? అంటూ ఎటకారపు కబుర్లు చెప్పేస్తుంటారు. వ్యవస్థల్ని మారుస్తామా? లేదా? అన్నది పక్కన పెడితే.. ముందు నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించాలి కదా? అంటే సమాధానం ఉండదు. సంబంధం లేని మాటలు చెబుతూ.. పోలింగ్ రోజున పార్టీలు పెట్టుకునేటోళ్లు.. హ్యాంగౌట్లకు ప్లాన్ చేసుకునేటోళ్లకు కొదవ ఉండదు.

అందుకు భిన్నంగా కాసేపట్లో పెళ్లి పెట్టుకొని.. ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన పెళ్లి కొడుకు ఉదంతం అందరిని ఆకర్షించింది. రెండో విడత పోలింగ్ లో భాగంగా మహారాష్ట్రలో శుక్రవారం పోలింగ్ జరిగింది. తన ఓటును వేసేందుకు కాసేపట్లో పెళ్లి పెట్టుకున్న పెళ్లి కొడుకు తన ఓటుహక్కును వినియోగించుకున్న వైనం అందరి మన్ననలు పొందింది. మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభా నియోజకవర్గం పరిధిలోని వదార్ పుర కు చెందిన నవ వరుడు ఆకాశ్ పెళ్లిదుస్తుల్లోనే పోలింగ్ కేంద్రానికి వచ్చాడు.

ఓటు వేసేందుకు వచ్చిన అతడితో పాటు.. అతని తల్లి.. మామయ్య వెంట ఉన్నారు. పెళ్లి వేడుక ముఖ్యం కదా? జీవితంలో ఒకేసారి వస్తుంది కదా? అని అక్కడున్న మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే.. పెళ్లి మధ్యాహ్నం 2 గంటలకు.. ఆ లోపు ఓటు వేసేయొచ్చు కదా? అంటూ బదులిచ్చిన ఆకాశ్ తీరును మెచ్చుకుంటున్నారు. ఇతగాడి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. పలువురు అతడి చర్యను అభినందిస్తున్నారు. మాటలు ఎందుకు.. చేతలతో ఎవరికి వారు ఓటేస్తే సరిపోతుంది కదా? మన పాలకుల్ని మనమే ఎన్నుకోవటానికి మించింది ఇంకేం ఉంటుంది చెప్పండి?

Tags:    

Similar News