లాలూ.. ఆరోగ్యం అస్సలు బాగోలేదా?

Update: 2020-11-09 18:20 GMT
అధికారం మేజిక్ లాంటిది. అది అద్భుతాల్ని చేస్తుంటుంది. అప్పటివరకు ఆరోగ్యం అంతగా లేని వారి చేతికి అధికారం వచ్చింతనే వారెంతలా మారిపోతారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. అదే సమయంలో నిక్షేపంగా ఉన్న వారి చేతి నుంచి పవర్ పోతే.. గాలి తీసిన బెలూన్ లా మారిపోతారు. చమక్కులతో.. మాట విరుపుతో రాజకీయ ప్రత్యర్థులకు చురుకు పుట్టించే బిహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి..మాజీ కేంద్రమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం ఇప్పుడు అస్సలు బాగోలేదట.

పశుగ్రాసం కుంభకోణం కేసులో 14 ఏళ్లు జైలుశిక్ష పడిన లాలూ.. గడిచిన కొన్నేళ్లుగా జైల్లోనే ఉంటున్నారు. ఒకప్పుడు బిహార్ కు కింగ్ గా ఉన్న ఆయన.. చివరకు జైలు గదికే పరిమితం కావటం ఆయన్ను తీవ్రంగా దెబ్బ తీసిందని చెబుతారు. ఆయన ఆరోగ్యం ప్రభావితం కావటమే కాదు.. చివరకు తనను కలిసేందుకు వచ్చిన వారిని సైతం కలవటానికి ఏ మాత్రం ఇష్టపడే వారు కాదు.

రెండేళ్ల క్రితం లాలూ శరీరంలోని చాలా అవయువాల పనితీరు సరిగా లేకపోవటంతో ఆయన్ను రిమ్స్ లో చేర్చారు. బీపీ.. షుగర్ తో పాటు గుండె సమస్యలు ఉండటంతో ఆయనకు బైపాస్ సర్జరీ చేశారు. కిడ్నీ పని తీరు కూడా ఏ మాత్రం బాగాలేదంటున్నారు. ప్రస్తుతం ఆయన స్టేజ్ 4లో ఉన్నారని.. మరింతగా ఆరోగ్యం క్షీణిస్తే.. ఆయనకు డయాలసిస్ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. అదే జరిగితే ఎయిమ్స్ కు రిఫర్ చేస్తారంటున్నారు.
Read more!

ఆయన ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల కారణంగా దీపావళికి ముందుగా ఆయన జైలు నుంచి బెయిల్ పైన విడుదల అవుతారని భావించారు. కానీ.. అలాంటి పరిస్థితి చోటు చేసుకోలేదు. దీంతో.. ఆయన మరింత దిగులుకు గురయ్యారని చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగోలేదంటున్నారు. మరో రోజులో బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశం ఉండటం.. తన కుమారుడు తేజస్వీ నాయకత్వంలో తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని సర్వేలు చెబుతున్న వేళ.. అదే జరిగితే విజయానందం లాలూఆరోగ్యాన్నికుదుటపడేలా చేస్తుందేమో?
Tags:    

Similar News