ఔనా..? రైతుల పేరుతో కవిత దండుకుంటోందా?

Update: 2015-10-13 10:33 GMT
 తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె రైతుల పేరుతో భారీ దోపిడీకి తెరతీశారని టీటీడీపీ ఆరోపిస్తోంది.  రైతు కుటుంబాలకు నష్టపరిహారం పేరుతో ఆమె వసూళ్లకు పాల్పడుతున్నారని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలపై కేసీఆర్ కు కనువిప్పు కలిగించాల్సిన కవిత పరిహారం పేరుతో వసూళ్లు చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు. రైతుల రుణమాఫీని ఏక కాలంలో చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. బీజేపీతో కలిసి చేసిన ఆందోళలన సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్, ఆయన కుమార్తె కవితలపై విరుచుకుపడ్డారు.

హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద టీడీపీ - బీజేపీ నేతల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాలో బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి  కూడా మాట్లాడారు. ఆయన కేసీఆర్ పై మండిపడ్డారు. తెలంగాణలో 1500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహించారు. మాట నిలబెట్టుకునే అలవాటు కేసీఆర్ కి లేదని ఆయన ఎద్దేవా చేశారు.

మరోవైపు రేవంత్ రెడ్డి కూడా టీఆరెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మాఅల్లుళ్లు కలిసి తెలంగాణను దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. మంగళవారం మెదక్‌ జిల్లా చిన్నకోడూరు మండలం మందపల్లి గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్బంగా గ్రామానికి చెందిన ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు భూ నిర్వాసితులు రేవంత్‌ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మామ - అల్లుని ఆరాచక పాలన నడుస్తోందని అన్నారు. భూ నిర్వాసితులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని, న్యాయం జరిగేంత వరకు టీడీపీ అండగా ఉంటూ పోరాటం చేస్తుందన్నారు. మంత్రి పదవీ రాగానే హరీష్‌ రావు రైతులను మర్చిపోయారన్నారు.

మొత్తానికి టీడీపీ - బీజేపీ నేతలు టీఆరెస్ ప్రభుత్వంపై దూకుడు పెంచినట్లుగానే కనిపిస్తోంది. కలిసికట్టుగా  ధర్నాలు చేయడమే కాకుండా తీవ్రస్థాయి ఆరపణలు చేస్తూ ప్రజల్లోకి వెళ్లేందకు ప్రయత్నం చేస్తున్నారు. కాగా ఎల్.రమణ కవితపై చేసిన ఆరోపణలను టీఆరెస్ శ్రేణులు కొట్టిపారేస్తున్నాయి.
Tags:    

Similar News