జగన్ గురించి సంచలన విషయాలు అంటున్న కేవీపీ

Update: 2023-04-01 13:48 GMT
కేవీపీ రామచంద్రరావు రాజకీయాల మీద అవగాహన ఉన్న వారికి ఆయన గురించి తెలుసు. ఆయన మంత్రి పదవులు చేపట్టలేదు, కీలక స్థానాలలో ఏమీ ఉండలేదు. రాజ్యసభ సభ్యుడిగా మాత్రమే పనిచేశారు. కానీ ఉమ్మడి ఏపీలోనూ విభజన ఏపీలోనూ కేవీపీ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్నారు. వైఎస్సార్ కి ఆత్మగా ఉన్న కేవీపీ జగన్ తో మాత్రం జత కలవలేదు. వైఎస్సార్ కుటుంబంలో సభ్యుడిగా ఉంటూ వచ్చిన కేవీపీ జగన్ కి దూరం కావడమే చిత్రంగా తోస్తుంది.

దాని మీద ఎవరి మటుకు వారు విశ్లేషణలు చేసుకున్నారు కానీ అసలు విషయం ఏమిటన్నది తెలియదు. జగన్ కేవీపీల మధ్య విభేదాలు నిజంగా ఉన్నాయా ఉంటే అవి ఏ స్థాయిలో ఉన్నాయి, అసలు ఎందుకు ఈ ఇద్దరికీ వివాదాలు వచ్చాయి అన్నది ఎవరికీ ఈ రోజుకీ తెలియదు. తెలుసుకోవాలన్న ఆసక్తి మాత్రం ఉంది.

అయితే ఆ ఉత్కంఠకు కేవీపీ రామచంద్రరావు తొందరలోనే తెర దించేయనున్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ మీద నిప్పులే చెరిగారు. రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం మీద కేంద్రంలోని బీజేపీ అనర్హత వేటు వేస్తే ముప్పయి మంది దాకా ఎంపీలు ఉండి కూడా జగన్ కనీసం మాట్లాడకపోవడం దారుణం అన్నారు.

కేంద్రంలోని బీజేపీతో జగన్ కి ఉన్న అంతర్గత చీకటి ఒప్పందాలు ఏంటో తనకు తెలియదు అంటూనే కేంద్రాన్ని ప్రశ్నించే విషయంలో మాత్రం వైసీపీ జంకుతోందని ఆయన విమర్శించారు. ఇదిలా ఉండగా వైఎస్సార్ కి అత్యంత ఆప్తుడిగా ఉన్న తాను జగన్ కి ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందన్న విషయాన్ని తొందరలోనే ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి మరీ ప్రజలకు వివరిస్తాను అంటూ కేవీపీ చెప్పడం సంచలనంగా ఉంది.

వైఎస్సార్ స్నేహానికి కుటుంబ బాంధవ్యానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చేవారని కేవీపీ కొనియాడడం విశేషం. ఆయన గొప్ప రాజనీతిజ్ఞుదు అని ప్రశంసించారు. మరి వైఎస్సార్ స్నేహ శీలి అంటున్న కేవీపీ జగన్ లో ఆ లక్షణాలు లేవని అభిప్రాయపడుతున్నారా అన్నదే అర్థం కాని విషయం అంటున్నారు. అలాగే కుటుంబ బాంధవ్యాలకు వైఎస్సార్ విలువ ఇచ్చేవారు అని ఆయన చెప్పడంలోని ఆంతర్యం ఏంటి అన్నది కూడా చర్చకు వస్తోంది.

మరో వైపు చూస్తే జగన్ విషయంలో కేవీపీ చెప్పే కీలక అంశాలు ఏంటి అన్న ఉత్కంఠ కూడా పెరుగుతోంది. జగన్ కేవీపీని మామ అని పిలుస్తారని అంటారు. అలాగే అల్లుడూ అని కేవీపీ సైతం చనువుగా జగన్ ని పిలిచేవారు అని చెబుతారు. అలాంటి మామా అల్లుళ్ళ మధ్యన ఎందుకు వివాదం రేగింది. అసలు ఎందుకు ఈ ఇద్దరూ దూరం అయ్యారు అన్నది చూడాల్సి ఉంది.

ఇక ఇన్నేళ్ళ పాటు మౌనంగా ఉన్న కేవీపీ ఇపుడే జగన్ మీద ఎందుకు విమర్శలు చేస్తున్నారు. అది కూడా చంద్రబాబు మంచి పాలనా దక్షుడు అని ఒక వైపు కితాబు ఇస్తూ జగన్ మీద విమర్శలు చేయడంలో ఉద్దేశ్యాలు ఏంటి అన్నది కూడా అంతా చర్చించుకుంటున్నారు
4

కేవీపీ వంటి వైఎస్సార్ ఆత్మ కనుక అసలు విషయాలు చెబితే జగన్ కి అది డ్యామేజ్ గా మారుతుందా లేక కేవీపీ మాటలను లైట్ గా వైసీపీతో పాటు జనాలు తీసుకుంటారా అన్నది కూడా చూడాలి. ఏది ఏమైనా ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి మరీ జగన్ గురించి చెబుతాను అని కేవీపీ అంటున్నారు అంటే ఏపీ రాజకీయాలో ఒక సంచలనానికి ఆయన తెర తీయబోతున్నారు అనే అంటున్నారు.      


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News