కేటీఆర్ స్పీక్స్ అగైన్‌!... ఏపీ సీఎం జ‌గ‌నే!

Update: 2019-03-30 11:29 GMT
తెలుగు నేల‌కు చెందిన రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎన్నిక‌లు జ‌రుగుతున్నా... రెండు రాష్ట్రాల‌కు ఓ తేడా ఉంది. ఇటీవ‌లే అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసిన తెలంగాణ‌లో ఇప్పుడు కేవ‌లం లోక్ స‌భ ఎన్నిక‌లు మాత్ర‌మే జ‌రుగుతున్నాయి. ఇక ఏపీ విష‌యానికి వ‌స్తే... లోక్ స‌భ ఎన్నిక‌ల‌తో పాటు అసెంబ్లీకి కూడా ఇక్క‌డ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. అంటే... వ‌చ్చే నెల 11న తెలంగాణ ఓట‌రు ఒక ఓటే వేయ‌నుండ‌గా, ఏపీ ఓట‌ర్లు మాత్రం రెండు ఓట్లు వేయ‌నున్నారు. ఈ రెండింటిలో ఒక‌టి అసెంబ్లీ ఎన్నిక‌ల ఓటు కాగా... రెండోది లోక్ స‌భ అభ్య‌ర్థికి సంబంధించిన ఓటు. మొత్తంగా రెండు రాష్ట్రాల్లోనూ ఒకే ద‌ఫా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో రెండు రాష్ట్రాల్లో ప్ర‌చారం హోరెత్తుతోంది.

ఏపీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో తెలంగాణ అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ.... టీఆర్ ఎస్‌ పై నిప్పులు చెరుగుతున్న టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు ఏపీ ప్ర‌జ‌ల్లో సెంటిమెంట్ ను రెచ్చ‌గొట్టే య‌త్నాలు చేస్తున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. అయితే చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌పై వ్యూహాత్మ‌కంగానే మౌనం పాటిస్తూ వ‌స్తున్న టీఆర్ ఎస్ నేతలు... అప్పుడప్పుడు మాత్ర‌మే ఏపీ ఎన్నిక‌ల‌కు సంబంధించి మాట్లాడుతున్నారు. అది కూడా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ లోకి వ‌చ్చేందుకు సంసిద్ధ‌త వ్య‌క్తం చేసిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడేస్తున్న గులాబీ నేత‌లు... మ‌రే విష‌యాలు మాట్లాడ‌టం లేదు. ఈ క్ర‌మంలో ఈ ఎన్నిక‌ల్లో ఏపీలో వైసీపీదే విజ‌య‌మ‌ని టీఆర్ ఎస్ నేత‌లు ఎప్పుడో తేల్చేశారు. టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇదే విష‌యాన్ని చాలా సార్లే చెప్పారు. తాజాగా నేటి ప్ర‌చారంలో భాగంగా అదే మాట‌ను కేటీఆర్ ప్ర‌స్తావించారు.

ఈ ఎన్నిక‌ల్లో ఏపీలో జ‌గ‌నే గెలుస్తార‌ని - ఆయ‌న ఏపీ సీఎం కావడం త‌థ్య‌మ‌ని కూడా కేటీఆర్ చెప్పారు. అంత‌టితో ఏపీ ప్ర‌స్తావ‌న‌ను ముగించిన కేటీఆర్‌.... కేంద్రంలో ఈ ద‌ఫా చ‌క్రం తిప్పేది తామేనంటూ మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పై దృష్టి సారిస్తామ‌ని చెప్పిన కేటీఆర్‌... ఫ్రంట్ లో త‌మ‌తో పాటు జ‌గ‌న్ కూడా ఉంటార‌ని చెప్పుకోచ్చారు. ఇంకా తృణ‌మూల్ అదినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ - ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్‌ - ఎస్పీ నేత అఖిలేశ్ యాద‌వ్ త‌దిత‌రులు కూడా ఉంటార‌ని ఆయ‌న చెప్పారు. ఈ ద‌ఫా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు 150కి మించి సీట్టు రావ‌ని తేల్చేసిన కేటీఆర్‌... ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు మాత్రం 170 దాకా సీట్లు జ‌మ చేరే అవ‌కాశాలున్నాయ‌ని, దీంతో కేంద్రంలో చ‌క్రం తిప్పేది ఫెడ‌ర‌ల్ ఫ్రంటేన‌ని కూడా ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు.


Tags:    

Similar News