కేటీఆర్ కు కోపం వస్తే.. వార్నింగ్ ఎంత ‘వయలెంట్’గా ఉంటుందో తేలింది

Update: 2020-08-19 05:00 GMT
భారీగా కురిసిన వర్షాలతో వరంగల్ మహానగరం మొత్తం వరదనీటిలో చిక్కుకుపోవటం.. నగరం నిండు కుండను తలపించేలా మారిన వైనం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకిలా జరిగిందన్న ప్రశ్నకు నేతలు.. అధికారులు.. కొందరి కక్కుర్తిగాళ్ల పుణ్యమా అని.. చెరువుల్ని ఆక్రమించి భారీ ఎత్తున నిర్మించిన అక్రమ నిర్మాణాలుగా తేల్చారు. వర్షం పడినప్పుడు నాలాల్లోకి వెళ్లాల్సిన వర్షపునీరు వెళ్లకుండా అక్రమ కట్టడాలు అడ్డుకోవటంతో తాజా దుస్థితి చోటు చేసుకుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

అధికారులు సైతం ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్ కు చెప్పినట్లుగా చెబుతున్నారు. దీంతో.. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆయన కీలక నిర్ణయాల్ని అక్కడికక్కడే తీసేసుకున్నట్లు చెప్పారు. వరంగల్ నగరంలో నాలాల వెంట ఉన్న సుమారు 270 అక్రమ కట్టడాలను.. వెంటనే కూల్చేయాలని చెప్పటమే కాదు.. అందుకు దసరాను లక్ష్యంగా ఇచ్చినట్లు చెప్పారు. దసరా లోపు నగరంలోని అక్రమ నిర్మాణాల్ని కొట్టేయాలని.. అందుకు హైదరాబాద్ లేదంటే ఫుణో నుంచి తెప్పించే యంత్రాలతో బహుళ అంతస్తుల్ని సైతం ఇట్టే కొట్టేయొచ్చని స్పష్టం చేశారు.

కూల్చివేత సమయంలో ఎమ్మెల్యేలు ఎవరు కలుగజేసుకోవద్దని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్.  ఆసక్తికరమైన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాలి. తన నిర్ణయాన్ని చెప్పినంతనే మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ స్పందిస్తూ.. ఇప్పటికే జిల్లా నేతలంతా మాట్లాడుకున్నామని.. అక్రమ నిర్మాణాల విషయంలో అస్సలు కల్పించుకోకూడదన్న నిర్ణయానికి తాము వచ్చినట్లుగా చెప్పటం గమనార్హం.

అక్రమ నిర్మాణాలతో పాటు.. బఫర్ జోన్ లో ఉన్న అక్రమ నిర్మాణాల్నికూడా గుర్తించాలని మంత్రి కోరారు. గొలుసుకట్టు చెరువులకున్న ఫీడర్ కాలువల్ని సరిగా నిర్వహిస్తే.. వరదల సమయంలో ప్రజలకు ఇబ్బందులు ఉండవన్నారు. సమగ్రంగా అధ్యయనం చేయటం.. నాలుగైదు టీంలుగా ఏర్పడి.. అక్రమ నిర్మాణాల్ని కూల్చేయాలని.. వాటికి సమాంతరంగా రిటైనింగ్ వాల్ నిర్మించాలని ఆదేశాలు జారీ చేశారు.

అంతేకాదు..సిటీ లోని 1200 శిథిల భవనాల్ని కూడా కూల్చేయాలని.. అందులో ఉన్న వారికి మాత్రం పునరావాసం కల్పించాలని కేటీఆర్ చెప్పారు. మొత్తానికి.. ఏదైనా విషయంలో తనకు కోపం వస్తే.. కటువైన నిర్ణయాలు ఎంత చకచకా తీసుకుంటానన్న విషయాన్ని మంత్రి కేటీఆర్ చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. మరి.. మంత్రివారు చెప్పినట్లు దసరా లోపు అక్రమ నిర్మాణాల్ని ఎన్ని కూల్చేస్తారో చూడాలి.
Tags:    

Similar News