హ‌రికృష్ణ అంత్య‌క్రియ‌ల్లో బాబేం చేశాడో చెప్పిన కేటీఆర్‌

Update: 2018-11-24 11:25 GMT
తెలంగాణ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని తన ఇమేజ్‌ ను బాగానే డ్యామేజ్ చేసుకున్నాడు చంద్రబాబు. తనకు సిద్ధాంతాలంటూ ఏమీ లేవని.. ఎప్పుడు ఎవరితో అయినా కలుస్తానని చంద్రబాబు మరోసారి చాటి చెప్పాడు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థులు చంద్రబాబును మాటలతో రఫ్ఫాడుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ మంత్రి కేటీఆర్.. చంద్రబాబు మీద తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ జనాల దృష్టిని ఆకర్షిస్తున్నారు. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఇప్పటిదాకా ఎన్నడూ కూడా ఒంటరిగా పోటీ చేసింది లేదని.. ప్రతిసారీ ఎవరితోనో ఒకరితో పొత్తు పెట్టుకున్నాడని.. ఆయనకు ఒంటరిగా పోటీ చేసే దమ్మే లేదని కేటీఆర్ విమర్శించాడు. బాబు కలవని పార్టీ ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమే అన్నాడు. అవసరమైతే ఆ పార్టీతో కూడా పొత్తుకు చంద్రబాబు రెడీ అవుతాడన్నారు. హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో సెటిలర్లతో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ బాబును గట్టిగా ఏసుకున్నాడు.

మరోవైపు చంద్రబాబు దేన్నయినా ఎలా రాజకీయం చేస్తాడో వివరిస్తూ.. ఒక ఉదాహరణ చెప్పాడు కేటీఆర్. గత నెలలో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మీద విశాఖలో దాడి జరిగిందని.. తాను అప్పుడు సిరిసిల్లలో ప్రచారం చేస్తున్నానని.. తనకు పీఏ విషయం చెప్పగానే.. కాసేపటికి దాడిని ఖండిస్తూ.. ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తూ.. జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ పెట్టానన్నాడు. ఐతే కాసేపటికే చంద్రబాబు ఉలిక్కి పడ్డారని.. కేసీఆర్.. కేటీఆర్.. జగన్.. మోదీ.. వీళ్లంతా ఒక్కటే అంటూ విమర్శలు చేశారని అన్నాడు. ఐతే తాను ట్వీట్ చేసింది 3 గంటల 38 నిమిషాలకు అని.. కానీ అంతకు గంట ముందే చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ సైతం జగన్ పై దాడిని ఖండిస్తూ ట్వీట్ పెట్టాడని కేటీఆర్ గుర్తు చేశారు. మరి లోకేశ్ కూడా తమతో కలిసినట్లేనా అని ప్రశ్నించాడు కేటీఆర్. చంద్రబాబు ప్రతిదాన్నీ ఎలా రాజకీయం చేయాలని చూస్తాడో చెప్పడానికి ఇది ఉదాహరణ అన్నాడు. ఆయన ప్రస్తుతం విపరీతమైన భయంలో బతుకుతున్నాడని.. అందుకే అన్నింటినీ బూతద్దంలో చూస్తున్నారని కేటీఆర్ అన్నాడు. హరికృష్ణ మరణించినపుడు కూడా తాము తమ విద్యుక్త ధర్మం నిర్వహించామని.. ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా నిలిచే ప్రయత్నం చేశామని.. కానీ చంద్రబాబు మాత్రం ఆ సమయంలో కూడా రాజకీయాల గురించే ఆలోచించాడని కేటీఆర్ విమర్శించాడు.


Tags:    

Similar News