కేసీఆర్ చెబితే స‌రిపోదా? కేటీఆర్ కూడా చెప్పాలా?

Update: 2018-10-02 05:05 GMT
కేసీఆర్ తిరుగులేని అధినేత‌. ఈ మాట‌ను తెలంగాణ వ్యాప్తంగా ఎవ‌రిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. కానీ.. తాజాగా చోటు చేసుకున్న  ఒక ఉదంతం ఆస‌క్తిక‌రంగానే కాదు.. కొత్త అనుమానాల‌కు తావిచ్చేలా ఉండ‌టం గ‌మ‌నార్హం. అసెంబ్లీని ర‌ద్దు చేసేసి..ఏకాఏకిన 105 మంది అభ్య‌ర్థుల్ని ఏక‌ప‌క్షంగా డిసైడ్ చేసిన కేసీఆర్ కాన్ఫిడెన్స్ గులాబీ నేత‌ల్నే కాదు.. విప‌క్ష పార్టీలోనూ సంచ‌ల‌నంగా మారింది.

ఎంత ద‌మ్ముగా.. అంత‌మంది అభ్య‌ర్థుల్ని ఊరుకు ముందే ప్ర‌క‌టించార‌న్న మాట జోరుగా వినిపించింది. కేసీఆర్ అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టించిన రెండు.. మూడు రోజులు అసంతృప్తి పెద్ద‌గా లేకున్నా.. ఆ త‌ర్వాత నుంచి ఒక్కొక్క‌రుగా గ‌ళం విప్ప‌టం.. అధినేత త‌న నిర్ణ‌యాన్ని మార్చుకోవాల‌న్న అభ్య‌ర్థ‌న‌లు అంత‌కంత‌కూ పెరిగాయి. చివ‌ర‌కు కేటీఆర్ సైతం.. త‌న‌కు అత్యంత స‌న్నిహితుడైన హైద‌రాబాద్ మేయ‌ర్ బొంతుకు ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్థిగా మార్చాల‌న్న ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు చెబుతున్నారు.

త‌న తండ్రి మీద ఒత్తిడిని తీసుకొచ్చి.. చివ‌ర్లో అయినా ఉప్ప‌ల్ అభ్య‌ర్థిని మార్చాల‌ని కేటీఆర్ భారీగా క‌స‌ర‌త్తు చేసిన‌ట్లుగా చెబుతారు. కానీ.. అలాంటి వాటిని స‌హించేది లేద‌న్న విష‌యాన్ని కేసీఆర్ తేల్చి చెప్ప‌టం.. ప్ర‌క‌టించిన అభ్య‌ర్థుల్లో ఒక్క‌రిని కూడా మార్చే ప్ర‌స‌క్తే లేద‌న్న మాట‌ను క‌రాఖండిగా చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు.

అభ్య‌ర్థుల మార్పు మాట‌ను కేసీఆర్ ముందు ప్ర‌స్తావించ‌టానికి టీఆర్ఎస్‌లో ఎవ‌రికి ధైర్యం స‌రిపోవ‌టం లేదంటున్నారు. అదే స‌మ‌యంలో.. అసంతృప్తుల నిర‌స‌న‌లు ఒక కొలిక్కి రాక‌పోవ‌టంతో చిర్రెత్తిన కేసీఆర్‌.. టికెట్ రాని వారు చేసే ఆందోళ‌న‌ల‌పై ఫైర్ అయ్యారు.

టికెట్ ఇవ్వ‌లేని వారికి ఎన్నిక‌ల త‌ర్వాత ఏదో ఒక‌టి చేస్తాన‌ని హామీ ఇచ్చిన త‌ర్వాత కూడా ఈ లొల్లి ఏంద‌న్న ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసి.. ఉంటే ఉండండి.. లేకుంటే పార్టీ నుంచి పొండ‌ని.. ఒత్తిడి త‌న మీద ఎలాంటి ప్ర‌భావాన్ని చూపించ‌దంటూ కేసీఆర్ ఫైర్ అయ్యారు. త‌న తండ్రి నోటి నుంచి వ‌చ్చిన మాట‌ల తీవ్ర‌త కానీ.. అంత‌కు ముందే ఆయ‌న‌కు అందిన సంకేతాల‌తో ఉప్ప‌ల్ అభ్య‌ర్థిని మార్చాల‌న్న కేటీఆర్ మైండ్ సెట్ కూడా మార్చుకున్న‌ట్లు చెబుతారు.

ఇదిలా ఉంటే.. తన తండ్రి కేసీఆర్ మాట‌ను తాజాగా కేటీఆర్ వ‌ల్లె వేయ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. అభ్య‌ర్థుల‌ను మార్చే ప్ర‌స‌క్తే లేద‌ని కేసీఆర్ తెగేసి చెప్పిన త‌ర్వాత కూడా స్టేష‌న్ ఘ‌న్ పూర్ లో తాజా మాజీ ఎమ్మెల్యే రాజ‌య్య‌కు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వొద్దంటూ చేస్తున్న నిర‌స‌న‌ల‌పై కేటీఆర్ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. ఉప ముఖ్య‌మంత్రి క‌డియంకు ఈ సీటు కేటాయించాల‌న్న డిమాండ్ కు నో చెప్పేశారు.

రాజ‌య్య అభ్య‌ర్థిత్వాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లో  మార్చే ప్ర‌స‌క్తే లేద‌ని స్ప‌ష్టం చేసిన కేటీఆర్‌..  తాజాగా క‌డియం.. రాజ‌య్య‌ల‌తో పాటు ప‌లువురు ద్వితీయ శ్రేణి నేత‌ల‌తో భేటీ అయ్యారు. కేసీఆర్ ప్ర‌క‌టించిన 105 స్థానాల్లో పాతిక స్థానాల్లో నిర‌స‌న‌లు ఉన్నాయ‌ని.. అందులో అభ్య‌ర్థుల్ని మార్చాల‌న్న డిమాండ్ పై కేసీఆర్ ఇప్ప‌టికే క్లారిటీ ఇచ్చార‌ని.. అభ్య‌ర్థుల్ని మార్చే అవ‌కాశం ఉండ‌ద‌ని చెబుతున్నారు.

అంద‌రూ ప‌ని చేయాల‌ని.. క‌సీఆర్ డిసైడ్ చేసిన అభ్య‌ర్థిని గెలిపించాలంటూ కేటీఆర్ మ‌రోసారి స్ప‌ష్టం చేయ‌టం గ‌మ‌నార్హం. కేసీఆర్ మాట‌ను ప‌ట్టించుకోకుండా తమ నిర‌స‌న‌ను సాగిస్తున్న గులాబీ ద‌ళాల‌కు కేటీఆర్ చెప్పే మాట‌లు వినే అవ‌కాశం ఉందా? అన్న‌ది ప్ర‌శ్న‌. అధినేత మాట‌కు లేని విలువ‌.. ఆయ‌న కొడుకు మాట‌కు ఇస్తార‌నుకోవ‌టం అత్యాశే అవుతుందంటున్నారు. ఎక్క‌డైనా బావే కానీ.. టికెట్ లెక్క‌ల ద‌గ్గ‌ర మాత్రం రాజీ ప‌డేది లేద‌న్న గులాబీ శ్రేణుల మైండ్ సెట్ కేసీఆర్ అండ్ కోను తెగ ఇబ్బంది పెట్టేస్తుంద‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News